YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

సీజనల్ వ్యాధులతో జరా భద్రం

సీజనల్ వ్యాధులతో జరా భద్రం
వర్షాకాలం రానే వచ్చింది. వస్తూనే రోగాలను తోడ్కొని వచ్చింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో రోజూ వర్షం పడుతూనే ఉంది. దీంతో గుంతల్లో నీరు చేరుతోంది. ఇదే అదునుగా దోమలు దండయాత్రను మొదలుపెట్టేశాయి. అపరిశుభ్ర ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా పలువురు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాల్వలు వెంబడి వర్షం, వాడుక నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో దోమలు వృద్ధి చెందాయి. అశాస్త్రీయ పద్ధతుల్లో నిర్మించిన మురుగు కాల్వలు, నీటి నిల్వల్లో గుడ్లు పెడుతూ దండయాత్ర మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ జ్వరం సోకినా అది డెంగ్యూ జ్వరంగా భావించి భయభ్రాంతులకు లోనౌతున్నారు. అయితే అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని వైద్యులు చెబుతున్నారు. 
డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది ?'ఏడిస్‌ ఈజిప్ట్‌' అనే దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ జ్వరం సోకిన రోగి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోతాయి. అయితే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోయే అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలుగా భావించనవసరం లేదు. అలాగే డెంగ్యూ జ్వరం సోకిన ప్రతి ఒక్కరూ మరణిస్తారని అనుకోవలసిన అవసరమూ లేదు. డెంగ్యూ వ్యాధిగ్రస్తులలో మరణాలు సంఖ్య సుమారు పదివేలకు ఒకటి మాత్రమేనని గుర్తెరగాలి. మొదటిది సాధారణ డెంగ్యూ. అది ప్లూ (జలుబు) వంటి లక్షణాలతో మొదలై దానంతట అదే తగ్గుతుంది. రెండోది డెంగ్యూ హెమధేఫీ ఫీవర్‌. ఈ దశలో రక్తం పోతుంది. మూడోది డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌. ఇది అత్యంత ప్రమాకరమైన దశ, రోగి శరీరం చల్లబడిపోయి, బిపి తగ్గిపోయి, మూత్రపిండాల పని సక్రమంగా జరగదు. ఈ దశలోనే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. మొదటి రకం వల్ల ఇబ్బందేమీ లేదు. రెండు, మూడు రకాలు మాత్రమే ప్రమాదకరం. అలా ప్రమాదానికి చేరుకునే రోగుల సంఖ్య వెయ్యి మందికి ఒకరు ఉండొచ్చు. ఈ వ్యాధికి సాధారణ మందులు చాలు. ప్రత్యేకమైన, ఖరీదైన మందులు అవసరం లేదు. రక్తం గడ్డకట్టే ప్లేట్‌లెట్స్‌ 10-15 వేల కంటే తగ్గితేనో లేదా రక్తస్రావం లక్షణాలు ఉంటేనో ఆ రక్తకణాలను ఎక్కించుకోవలసిన అవసరం ఉంటుంది. కణాలు కొంచెం తగ్గితేనే గాబరాపడి కణాలు ఎక్కించుకోవలసిన అవసరం లేదు. భయపడి డాక్టరు మీద వత్తిడి తెచ్చి ఎక్కించుకోవలసిన అవసరం లేదు. ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే అవసరం లేకుండానే ఎక్కువ మందికి వ్యాధి నయమవుతుంది. ఈ విషయాలపై అవగాహన లేని వాళ్ళు భయపడి ఎక్కువగా ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. 
నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు.మన ఇళ్ళలోగానీ, పరిసర ప్రాంతాలలోగానీ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.  తాగి పారేసిన కొబ్బరి బొండాలు, టైర్లు, పగిలిపోయిన కుండీలు, సీసాలు, టెంకాయ చిప్పలు, ఖాళీ డబ్బాలు మొదలైనవి చుట్టు పక్కల లేకుండా చూసుకోవాలి.  పూలకుండీల్లో, ఎయిర్‌ కూలర్లలో, ఫ్లవర్‌ వాజుల్లో, నీటి తొట్టెల్లో నీరు ఎక్కువ కాలం నిల్వలేకుండా వారానికొకసారి శుభ్రం చేయాలి. వీలైనంత వరకు శరీరమంతా కప్పేటట్లు ఉండే బట్టలు వేసుకోవాలి. 
నిద్రించేటప్పుడు ముఖ్యంగా పగలు కూడా దోమతెరలు వాడడం తప్పనిసరి. ఎందుకంటే డెంగ్యూకు కారణమైన దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. 
 దోమలు కుట్టకుండా శరీరానికి క్రీములు వంటివి పూసుకున్నట్లయితే కొంత వరకు మేలు. దోమలు ఎక్కువుగా ఇంటిలోకి ప్రవేశించే సమయాల్లో అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో తలుపులు, కిటికీలు మూసివేయాలి. కిటికీలు, తలుపులకు దోమతెరలు బిగించుకోవాలి. ఎలక్ట్రికల్‌ బ్యాట్‌లు ఉపయోగించవచ్చు. ఇళ్ళలో ఆలౌట్‌ కాయిల్స్‌ పెట్టుకోవాలి. వేప పొగ చేసుకోవాలి.  జ్వరం ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి.  కలుషిత నీరు కాకుండా రక్షిత మంచినీరు లేదా చల్లార్చిన నీటిని తాగాలి.  ఎలుకల పట్ల కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.వారానికి ఓసారి డ్రైడే పాటించాలి.  ఆరు బయట మలమూత్ర విసర్జన చేయరాదు. మరుగుదొడ్డిని ఉపయోగించాలి. పాల డబ్బాలను శుభ్రంగా ఉంచాలి. వాటిని వేడి నీటితో శుభ్రంగా కడగాలి. 
 

Related Posts