మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమై పోయింది. ఆషాఢమాసం వెళ్లిపోయాక ఆయన ఫ్యాన్ పార్టీలో చేరనున్నారు. అయితే ఆనం నిర్ణయం ఆయన కుటుంబంలో చిచ్చు రేపిందంటున్నారు. ఎన్ని పార్టీలు మారినా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం ఒక్కటిగా ఉండేది. ఆనం వివేకానందరెడ్డి జీవించి ఉన్నంత కాలం కుటుంబం మొత్తం సమిష్టి నిర్ణయం తీసుకునేది. కాని వివేకా మరణం తర్వాత ఆనం రామనారాయణరెడ్డి రాజకీయాల్లో కుటుంబానికి పెద్దదిక్కుగా మారారు. ఆయన నిర్ణయమై ఫైనల్. అయితే ఆనం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఆనం ఫ్యామిలీలో విభేదాలు సృష్టించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతున్నారు. ఆనం కుటుంబంలో పెద్దవాడైన వివేకానందరెడ్డి ఇటీవలే మరణించారు. ఆనం సోదరులు జయ, విజయలు చెరో దారి పట్టారు. ఆనం విజయకుమార్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. మరో సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి తొలుత వైసీపీలో ఉన్నా అక్కడ తనకు ప్రాధాన్యత దక్కడం లేదని టీడీపీలో చేరారు. ఆయన త్వరలో జరగనున్న టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. జయకుమార్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా మారిపోయారు.
ఇక ఆనం వివేకానందరెడ్డి ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో ఇప్పటికే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆనం వివేకానందరెడ్డి పోటీకి విముఖత చూపడంతో ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. రెండోకుమారుడు రంగమయూర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరిలో ఒకరికి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయి త్వరలోనే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నా వీరిద్దరూ ఇంతవరకూ తమ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించకపోవడం విశేషం.అయితే వీరిద్దరిలో ఇటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీకి అభ్యర్థుల కొరత లేదు. బలమైన అభ్యర్థులు రెండు పార్టీలకూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధినేత ఏదో ఒక స్థానంలో టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందే తప్ప వీరికి ఇచ్చే ఛాన్స్ లు లేనేలేవు. ఈ నేపథ్యంలో వీరు చిన్నాన్న వెంట నడుస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రంగమయూర్ రెడ్డి విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించినా పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. దీంతో ఆనం వెంట వీరు నడిచేది అనుమానమేనంటున్నారు. మొత్తం మీద ఆనం నిర్ణయం కుటుంబంలో చిచ్చురేపిందంటున్నారు.