చంద్రుడు ఏర్పడిన తొలినాళ్లలో దానిపై జీవులు బతికేందుకు అనుకూలమైన వాతావరణం ఉండేదని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడి ఉపరితలం కింది పొరల్లో మంచు రూపంలో భారీగా నీటి నిల్వలు ఉండటాన్ని ప్రధాన ఆధారంగా చూపిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. చంద్రుడిపై రెండుసార్లు జీవానుకూల జాడలు ఏర్పడ్డాయి. చంద్రుడు 450 కోట్ల ఏండ్ల కిందట ఆవిర్భవించాడు. తొలినాళ్లలో భూమి మాదిరిగానే వాతావరణం, చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉండేది. సౌర తుఫాన్ల కారణంగా క్రమంగా చంద్రుడి ఉపరితలం పొడిబారిపోయింది. ఆ తర్వాత 50 కోట్ల ఏండ్లకు అంటే 350 కోట్ల ఏండ్ల కిందట చంద్రుడిపై ఉన్న భారీ అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి. ఈ సమయంలో లావాతోపాటు ఉపరితలం నుంచి వేడి ఆవిర్లు బయటికి వచ్చాయి. అవి క్రమంగా చంద్రుడి ఉపరితలంపై సరస్సులు వంటి జలవనరులను, మేఘాలుగా మారి వాతావరణాన్ని ఏర్పాటుచేశాయి. ఈ వాతావరణం కొన్ని కోట్ల ఏండ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ పూర్తిగా పొడిబారిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం ఉల్కలు ఢీకొట్టడం ద్వారా జీవం భూమిపైకి చేరింది. జీవాన్ని మోసుకొచ్చే ఉల్కలు భూమిని ఢీకొట్టినట్టే చంద్రుడినీ ఢీకొట్టి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ సమయంలో చంద్రుడిపై జీవానుకూల వాతావరణం ఉన్నదని, చంద్రుడిపై ఉన్న జల వనరుల్లో సైనోబ్యాక్టీరియా చేరి కోట్ల ఏండ్లపాటు జీవించి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. చంద్రుడిపై జీవ పరిణామం జరిగిందో లేదో తేలాల్సి ఉన్నదన్నారు. వీరి పరిశోధన వ్యాసం ఆస్ట్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.