మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరలో ఆ రాష్ర్టానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ వరుసగా నాలుగో సారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నిధులను సేకరించేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కొత్త ప్లాన్ చేసింది. మొత్తం 230 నియోజకవర్గాల్లో రూ. 46 కోట్లు వసూళ్లు చేయాలని బీజేపీ.. ఆ పార్టీ నేతలను ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు డబ్బులు వసూలు చేయాలని చెప్పింది. ఇందుకు రూ. 200, 500, 1,000, 2,000ల కూపన్లను కమల దళం నేతలు తయారు చేస్తున్నారు. ఈ విధంగా డబ్బులను సేకరించి రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సారి కూడా మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీని ఆదరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి స్పష్టం చేశారు. బీజేపీ నిధుల సేకరణపై కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ సింగ్ వర్మ స్పందించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, వ్యాపార్లను గుర్తించి.. వారి నుంచి డబ్బులను వసూళ్లు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం బీజేపీ గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. పదిహేను సంవత్సరాల బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని సజ్జన్ సింగ్ చెప్పారు.