పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో పీటీఐ ముందంజ. 59 స్థానాల్లో నవాజ్‌షరీఫ్ పార్టీ 34 స్థానాల్లో పీపీపీ. బుధవారం జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ అధిక స్థానాల్లో దూసుకుపోతోంది. సైన్యానికి అనుకూలంగా మారి, ఇస్లామిక్ గ్రూపులతో చేతులు కలిపి, ఉగ్రతండాల పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్న ఇమ్రాన్‌ఖాన్ దశ తిరిగిపోయినట్లే. ప్రధాని పదవికి ఆయన అడుగు దూరంలో ఉన్నారు. 272 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగ్గా, 252 స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడయింది. కడపటి సమాచారం అందేసరికి ఇమ్రాన్ పార్టీ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించాలని ప్రధాన పార్టీలు చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. హింసాత్మక సంఘటనల మధ్య పాకిస్థాన్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలయిన కొద్ది గంటల తర్వాత ఐసిస్ ఆత్మాహుతి బాంబర్ ఒకరు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని భోసా మండి ప్రాంతంలో పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో పోలీసులు సహా 31 మంది మరణించారు. వేర్వేరు సంఘటనల్లో జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మరణించారు.