ఏపీ సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సర్వే నిర్వహించి.. వచ్చిన ఫలితాలపై తీవ్రంగా మేధోమదనం జరుపుతారు. అత్యంత కీలకమైన 2019 ఎన్నికల విషయంలోనూ పొత్తులపై మళ్లీ దీనినే నమ్ముకున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ కడుతుందనే ప్రచారం జోరుగుతోంది. దీనిపై ఇరు పార్టీల నేతలు అవగాహనకు వచ్చారనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పొత్తుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపే పనిలో పడ్డారు. ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడాన్ని ప్రజలు హర్షిస్తారా లేదా? ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చూపుతుంది? అనే సందేహాలు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతల్లోనూ ఉన్నాయి. అందుకే పొత్తుపై ముందుకెళ్లాలా వద్దా అనే అంశంపై ఒక సర్వే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారట. మరో వైపు సభలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు ప్రజల్లో వారిపై ద్వేషాన్ని తగ్గించాయంటూ ఎంపీలతో కామెంట్ చేయడం... ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. 90 శాతం హామీలు నెరవేర్చామన్న బీజేపీ నేతల ప్రసంగాలు వారి అహాన్ని ప్రదర్శించాయన్నారు. హామీలిచ్చిన రోజున సభలో ఉన్న ఆజాద్, జైరాం రమేశ్, ఆనంద్ శర్మ స్పందన ఎలా ఉందో ప్రజలు గమనించారు. అప్పుడు సభలో లేని జీవీఎల్ నరసింహారావు, పీయూష్ గోయెల్ ఏపీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు.ఏపీని అడ్డగోలుగా విభజించి తీవ్ర అన్యాయం చేసిందననే ప్రచారం గత ఎన్నికల్లో టీడీపీకి బాగా కలిసొచ్చింది. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి ఆ పార్టీకి ఏపీలో స్థానం లేకుండా చేశారు చంద్రబాబు! నాలుగేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్.. ఏపీకి న్యాయం చేస్తామని చెబుతోంది. ఏపీకి హోదా ఇస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న టీడీపీ.. కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత.. దీనిపై మరింత స్పష్టత కనిపిస్తోంది. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదు.. కానీ ఏపీలో పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. తెలంగాణలో ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ఇరువురికీ లాభదాయకమే అన్న ఓ అంచనా ఉంది. అయితే చిక్కంతా ఏపీలోనే వస్తోంది.ఈ రెండు పార్టీల కలయికను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేగాక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పావుగా వాడుకుని బాబు.. చేసిన ప్రచారం చాలా వరకూ ప్లస్ అయింది. ఇక రాజకీయంగానూ ఎంత మంది ఆమోదం తెలుపుతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా ? పొత్తు లాభమా ? నష్టమా అన్న అంశాలపై టీడీపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చే పనిలో పడిందని ఓ సీనియర్ నేత తెలిపారు. దీనికి సంబంధించి ఓ సర్వే కూడా జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన సంకేతాలకు చేరుతున్నాయి.ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు పైపైకి చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా.. ఇవన్నీ ప్రజల్లో గుర్తింపు కోసమే! ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తుంటే.. మేం బంద్ కు మద్దతు ఇవ్వం అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో పొత్తుకు ఛాన్స్ లేకపోయినట్లే ఇలా ఎందుకు నిర్ణయించిందనే ప్రశ్న వినిపిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు ఇంచుమించు లేనట్లే అని అంచనాకు వచ్చిన తర్వాతే చంద్రబాబు.. క్రమక్రమంగా కాంగ్రెస్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పొత్తుకు మార్గం సుగమం చేసేలా అన్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ రెండు పార్టీల పొత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద సంచలనమే అవుతుంది. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న సంకేతాలు వచ్చినప్పుడే పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరగడంతో పాటు పార్టీ నుంచి కొంతమంది బయటకు వెళ్లిపోయారు. మరి ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే రెండు రాష్ట్రాల్లో టీడీపీ నాయకుల్లోనే చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మరి బాబు డెసిషన్లు ఎలా ఉంటాయో ? చూడాలి