సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గుండాలు, ఫ్యాక్ష్యనిస్టులు రాజ్యమేలుతారని, ఏమీ ఆశించకుండా స్వార్ధం లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టక్కర్లేదని, ధైర్యం, తెగింపు సహనం ఉంటే చాలన్నారు. గురువారం ఉదయం భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో డిఎన్ఆర్ కళాశాల విద్యార్ధులు, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల జనసైనికులతో విడివిడిగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డుపై తిరిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మగాంధీ చెప్పారని, కానీ ప్రస్తుతం పగలు కూడా ఆడపిల్లలు రోడ్డుపై తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతే జనసేన పార్టీ ప్రధాన అంజెడా అని స్పష్టం చేశారు. 2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమని, అందరూ ఓట్లు నమోదు చేసుకోవాలని, ఓట్లు తీసేస్తే తిరిగి చేర్చే వరకు పోరాటం చేయాలన్నారు. సినిమాల్లో చెప్పిన నీతులు ఒక్కక్షణం ఆలోచింపజేస్తాయి తప్ప వాస్తవ రూపం దాల్చవని, వాస్ేవ రూపం దాల్చాలంటే ఏం చేయాలనే ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసేవాళ్లు చట్టం నుంచి తప్పించుకుని మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రోకర్ పని చేసేవాడు కోట్లు సంపాదిస్తుంటే .. పీజీలు, పీహెచ్ డీలు చేసిన విద్యావంతులు వాడికింద పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవస్థ మారాలని అన్నారు.
నేను మంత్రి నారా లోకేష్ లాగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని, ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం, మాట్లడకపోతే ఆంధ్రవాళ్లు తిట్టే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు.
మంత్రి లోకేష్ లాంటివారు ఏ పనికి ఎంతొస్తుంది అన్నస్వార్ధంతో ఆలోచించి పాలసీలు చేస్తారని విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు ధైర్యం చాలలేదని, ధైర్యం కూడగట్టుకోవడానికి దశాబ్ధం పట్టిందని చెప్పారు. నా కుటుంబాన్ని పక్కనపెట్టి వచ్చానని చెప్పారు.
ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిలా నేను కూడా తిట్టగలను.. నాకు బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను, కానీ దాని వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. వీళ్ల మాటలను ఎందుకు భరిస్తున్నాను అంటే కొత్తతరానికి బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే ఉద్దేశంతోనే అని చెప్పారు. రాజకీయ నాయకులు చేసే పాలసీల వల్ల సామాన్యుడు ఇబ్బందిపడకూడదని, అందుకే మరో 25 ఏళ్లు నా జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.