ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లాకు చేరుకున్న సీఎం అక్కడి నుంచి పశివేదల గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్దిపై అదికారులతో చర్చించారు. తరువాత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లైనా కేంద్రం హామీలు నెరవేర్చలేదని, అందుకే విభేదించి బయటకొచ్చేశామని తెలిపారు. అయినా దేశంలోనే ప్రజా సంక్షేమ పథకాల అమలుకు చిరునామాగా రాష్ట్రాన్ని మార్చామని సీఎం చంద్రబాబు అన్నారు. దళారీ వ్యవస్థ రూపుమాపడానికి ప్రతి పథకాన్ని బయోమెట్రిక్లో తీసుకొచ్చామన్నారు. పెళ్లికానుక, చంద్రన్న బీమా వంటి పథకాలతో పేదవారిని ఆదుకుంటున్నామన్నారు. గ్రామాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నామన్నారు. గ్రామదర్శిని-గ్రామ వికాసంతో గ్రామాల్లోకి అధికారులు వస్తారని, గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారన్నారు.