అమెరికాలో హెచ్1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తుందనే షాక్ వార్త నుంచి తేరుకోవడానికి ముందే...భారత ఐటీ కంపెనీలు పొందిన హెచ్ 1బీ వీసాల సంఖ్య రెండేళ్ళలో సగానికి పడిపోయాయనే నివేదిక విడుదల అయింది. ఈ వార్త కలకలం ఇంకా సద్దుమణగకముందే..తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకో షాకింగ్ వార్తను తెరమీదకు తెచ్చారు. అదే గత 30 ఏళ్లుగా దేశ పౌరసత్వం పొందిన వారి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డిసైడ్ అవడం. ఇది ప్రతిపాదనకే పరిమితం కాలేదు..ఏకంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) లాస్ ఏంజిల్స్ లో ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడంతో...విదేశీయుల్లో కలవరం మొదలైంది.విదేశీయులపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ సర్కారు ఈ క్రమంలో ఇప్పటికే వీసా నిబంధలు కఠినం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు పౌరసత్వం పొందిన వారిపై కన్నెర్ర చేసేందుకు సిద్ధమైంది. దేశంలోని కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో పాటు అక్రమ మార్గాల్లో పౌరసత్వం పౌందారని అమెరికా అనుమానిస్తోంది. ఇందులో భాగంగా లక్షలాది దరఖాస్తులను మరోసారి పరిశీలించడానికి పావులు కదుపుతోంది. ఇందుకు రెండేళ్ల కిందట జరిగిన పరిణామాన్ని ఉదాహరణగా తీసుకుంటోంది. 2016 సెప్టెంబర్ లో హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ ఎస్) ఇన్ స్పెక్టర్ జనరల్ అనర్హులైన వారికి దేశ పౌరసత్వం దక్కిందని పేర్కొంటూ విడుదల చేసిన ఒక రిపోర్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు 858 మంది అనర్హులకు పౌరసత్వాన్ని లభించిందని ఆ రిపోర్టు వెల్లడించింది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తరచుగా ఫింగర్ ప్రింట్ లను అప్ డేట్ చేయకపోవడం వల్లే అనర్హులైనప్పటికీ వారికి పౌరసత్వం వచ్చినట్లు ఆ తర్వాత విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో రికార్డులన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించింది. అది కూడా 1990 నుంచి. అంటే దాదాపుగా 30 ఏళ్ల కిందటి నుంచి ఇప్పటివరకూ జారీ అయిన దాదాపు కోటి డెబ్బై లక్షల మంది పౌరసత్వాలను - వారి రికార్డులను ఈ టాస్క్ఫోర్స్ తనిఖీ చేయాలని నిర్దేశించారు. పౌరసత్వం కోసం సదరు వ్యక్తులు ఇచ్చిన పత్రాలు - ఇంటర్వ్యూల్లో ఏవైనా తప్పుడు సమాచారం ఇచ్చారా? వంటి పలు కోణాల్లో దర్యాప్తు సాగనుంది. అప్పట్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా వరకూ పేపర్ - ఫింగర్ ప్రింట్ వర్క్ లతో పౌరసత్వాలను ప్రధానం చేశారు. దీంతో అవకతవకలు జరిగి ఉన్నాయో తేల్చేందుకు డిజిటల్ విధానం ఫాలో కానుంది. ఈ క్రమంలో అనుమానాస్పద కేసులను న్యాయశాఖ పరిశీలనకు పంపాలని ఇమిగ్రేషన్ విభాగం భావిస్తోంది. ఈ నిర్ణయం ఫలితంగా వేల సంఖ్యలో అనుమానిత కేసులు న్యాయశాఖ వద్దకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆదిలోనే విమర్శలు మొదలయ్యాయి. అక్రమ పౌరసత్వాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమించడం మంచి పద్దతేనని పేర్కొంటూ ఇది దేశ పౌరసత్వం పొందిన వారిని వ్యాకులతకు గురి చేయనుందని అంటున్నారు. 30 ఏళ్ల కిందట పత్రాలు పొందిన వారు ఇప్పటికీ సదరు వివరాలను తమ వద్ద ఉంచుకోకపోతే..వారి పౌరసత్వాన్ని తిరిస్కరించే అవకాశాలు ఉండటం వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందని వెల్లడిస్తున్నారు. 2017 జనవరిలో ఇదే తరహా ప్రక్రియతో ఓ వ్యక్తికి అమెరికా పౌరసత్వాన్ని ఉపసంహరించిన వంటి సందర్భమే మళ్లీ చోటుచేసుకోవచ్చునని అంచనావేస్తున్నారు. కాగా ఈ ప్రక్రియ ఆర్థికంగా కూడా భారమని అంటున్నారు. ఇమిగ్రేషన్ విభాగం ప్రారంభిస్తున్న ఈ కొత్త కార్యాచరణకు అయ్యే ఖర్చు మొత్తం పౌరసత్వ దరఖాస్తు దారులపైనే పడనుంది. పౌరసత్వం పొందగోరే వారు ఇంటర్వ్యూలు పూర్తి కావాలంటే దరఖాస్తు చేసిన నాటి నుంచి కనీసం ఏడాది కాలం పట్టడం వల్ల వారికి ఉద్యోగ సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొంటున్నారు. కాగా ప్రభుత్వమే ఈ పనిచేసినా...ఎందరో అర్హులుగానే తేలుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రయత్నం వృథాగా మారతుందని ఈ ప్రక్రియలో అలాంటి కేసులే ఎక్కువ ఉంటాయని కొందరు పెదవి విరుస్తున్నారు.