సిరియా దక్షిణ ప్రాంతంలో భయంకర ఉగ్రదాడులు జరిగాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు ఆత్మాహుతి దాడులు, కాల్పులకు తెగబడటంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌కు చెందిన ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. సిరియాలో జరిగిన భయంకర ఉగ్రదాడుల్లో ఇది ఒకటని పేర్కొంది. సువేదా ప్రావిన్స్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.నిన్నటి నుంచి మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాత్రి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికి 246 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో 135 మంది సాధారణ పౌరులు ఉన్నారని బ్రిటన్ అబ్జర్వేటరీ చీఫ్ రమి అబ్దెల్ రెహమాన్ వెల్లడించారు. మృతులలో మిగతా వారు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న వారు, స్థానికులను కాపాడడానికి స్వచ్ఛందంగా ఆయుధాలతో ముందుకు వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని దీంతో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోందని అన్నారు. సువేదా ప్రావిన్స్‌లో బుధవారం మూడు ఆత్మాహుతి దాడులు జరిగాయి. అనంతరం తుపాకులు, బాంబులతో ఉగ్రవాదులు ప్రజలపై విరుచుకుపడ్డారు. నిన్న సాయంత్రం నాలుగో పేలుడు కూడా సంభవించింది. దాడుల్లో 45 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అబ్జర్వేటరీ తెలిపింది. బుధవారం సువేదా ప్రాంతంలో దాడులు జరపగా 250 మంది చనిపోయినట్లు సమాచారం.