YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కార్గిల్‌ యుద్ధ వీరులకు ప్రధాని ఘన నివాళి

కార్గిల్‌ యుద్ధ వీరులకు ప్రధాని ఘన నివాళి
 కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని కార్గిల్‌ యుద్ధ వీరులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. పాకిస్థాన్‌పై కార్గిల్‌‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించి నేటికి 19 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మోదీ ట్విటర్ ద్వారా యుద్ధ వీరులకు వందనం చేశారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో పనిచేసిన సైనికులందరికీ ఈ దేశం కృతజ్ఞతలతో అంజలి ఘటిస్తోంది. సాహసవంతులైన మన సైనికులు భారతదేశం సురక్షితమని రుజువు చేశారు. దేశంలోని శాంతియుత వాతావరణాన్ని నాశనం చేయాలనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు.కార్గిల్‌ దివస్‌ సందర్భంగా యుద్ధ సమయంలో భారత ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయిపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో అద్భుతమైన రాజకీయ నాయకత్వాన్ని అందించిన అటల్‌ జీని భారత్‌ ఎల్లప్పుడూ సగర్వంగా గుర్తు చేసుకుంటుంది. దేశాన్ని ఆయన ముందుండి నడిపించారు. సైన్యానికి మద్దతిచ్చారు. ప్రపంచం ముందు భారత వైఖరిని స్పష్టంగా చూపించారు’ అని మోదీ మరో ట్వీట్‌ చేశారు.కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ ట్విటర్‌ వేదికగా కార్గిల్‌ యుద్ధ వీరులకు వందనం చేశారు. మన వీర సైనికుల ధైర్యం, పరాక్రమం, త్యాగాలకు సెల్యూట్‌ అని ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ అడ్మైరల్‌ సునిల్‌ లంబా, చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా దిల్లీలోని అమర జవాన్‌ జ్యోతి వద్ద కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని నివాళులర్పించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఈ సందర్భంగా చక్కని సైకత శిల్పాన్ని రూపొందించారు. ధైర్యసాహసాలు గల మన సైనికులను చూసి గర్వపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Related Posts