లోక్ సభ ఎన్నికలకు ఇటు అధికార పక్షం, ఇటు విపక్షం సమాయత్తమవుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో విపక్షాలు అన్నీ కలసి పోటీ చేస్తాయా? విడివిడిగా పోటీ చేస్తాయా? అన్నది పక్కన పెడితే ‘‘మోదీ వర్సెస్ అదర్స్’’ గా పోరు మారితే అదుర్సేనంటున్నారు విశ్లేషకులు. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ప్రశ్నే. విపక్షాలన్నీ ఏకమైతేనే తమకు మంచిదన్న భావనలో కమలనాధులున్నారు. అందరూ ఏకమైతే మోదీ పట్ల సానుభూతి పవనాలు వీస్తాయని కమలం పార్టీ ఆశిస్తుంది. గతంలో ఇందిరకు ఇదే విధంగా జరిగిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అందువల్ల విపక్షాలు ఏకమైనా…విడిపోయినా తమకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండబోదంటున్నారు కమలం పార్టీ నేతలు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణాది విషయానికి వచ్చే సరికి బీజేపీ స్వతహాగా గెలుచుకునే సీట్లు తక్కువే ననిచెప్పాలి. కర్ణాటక రాష్ట్రం మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ తెచ్చుకునే సీట్లు వేళ్ల మీద లెక్చించవచ్చు. ఈ నేపథ్యంలో పాత మిత్రులు బయట నుంచి వెళ్లిపోయినా దక్షిణాదిన కొత్త వారిని కలుపుకునే ప్రయ్నతం చేస్తున్నారు కమలనాధులు. తెలంగాణలో కేసీఆర్ తో స్నేహ హస్తాన్ని చాస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేకు నాయకత్వ లోపం ఉండటం కారణంగా రజనీకాంత్ పార్టీ, అన్నాడీఎంకే కలసి కూటమిగా బరిలోకి దింపాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం యోచనగా ఉంది.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి ఇటీవలే బయటకు వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో తాము బలంగా లేకపోయినా తమకు మద్దతు నిచ్చే ప్రాంతీయ పార్టీలకు లోపాయి కారీ సహకారం అందించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీలకు ఇదే రకమైన సహాకారన్ని ఎన్నికల్లో అందించే అవకాశాలు లేకపోలేదు. ఇక రజనీకాంత్ కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లే కన్పిస్తోంది. ఇటీవల జమిలీ ఎన్నికల ప్రతిపాదనలకు కూడా రజనీ మద్దతిచ్చారు. తమిళనాడులో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగే అవకాశాలు లేవుఅందువల్ల ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ సీట్లను ఎక్కువగా కొల్లగొట్టకుండా కంట్రోల్ చేయాలన్ని అమిత్ షా వ్యూహంగా కన్పిస్తోంది. తమిళనాడులో సొంతంగా పార్టీ బలోపేతం చేయడానికే అమిత్ షా ఇటీవల పర్యటించినా అసలు విషయం మాత్రం వేరే ఉందని అంటున్నారు. రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీ ప్రకటనే చేయలేదు. బహుశా డిసెంబర్ లో చేయవచ్చంటున్నారు. రజనీ పార్టీప్రకటించినా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. దీంతో రజనీకాంత్ అన్నాడీఎంకేను లోక్ సభలో బలపరిస్తే కొంత మేలుచేకూరుతుందని కమలం పార్టీ ప్లాన్ వేస్తున్నట్లు తెలియవచ్చింది. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా కాకున్నా తమ మిత్రులు ఎక్కువ స్థానాల్లో గెలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందంటున్నారు.