YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

క్రికెట్ కెప్టెన్ నుంచి దేశాధినేత వరకు ఇమ్రాన్

 క్రికెట్ కెప్టెన్ నుంచి దేశాధినేత వరకు ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని పీఠాన్ని ఒక మాజీ క్రికెటర్ అధిష్టించబోతున్నారు. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు ఇమ్రాన్ ఖాన్‌ది. దశాబ్దాల కిందట క్రికెట్ ఆడినప్పటికీ ఇప్పటి తరానికీ ఈ పేస్ బౌలర్ పేరు సుపరిచితమే. పాకిస్తాన్ టీంకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా ఉన్న ఆయన ఇప్పుడా దేశానికి కెప్టెన్ కాబోతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్’(పీటీఐ) అత్యధిక సీట్లు గెలచుకోవడంతో ఆయనకు ప్రధాని పదవి దక్కనుంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలో తాలిబన్ ఉద్యమానికి ఇమ్రాన్ అనుకూలంగా ఉంటారు. ఆల్ ఖైదా నేతలతోనూ ఆయనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి.1992లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన పాక్ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్. అప్పటి నుంచి ఆ దేశంలో ఆయనకు ‘కప్తాన్’ అనే పేరు స్థిరపడిపోయింది. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో లండన్‌లో ఆయన విలాసవంతమైన జీవనశైలి గడిపేవారు. ఆ తరువాత 1996లో పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి ఆయన తన కొత్త పార్టీతోనే ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఆయన రాజకీయ పార్టీని స్థాపించినా, ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇమ్రాన్ స్వయంగా 9 స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లోనూ ఓడిపోయారు.ఆ తరువాత ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 2013సాధారణ ఎన్నికల తరవాత పీటీఐ దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాటి నుంచి ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలతో పాటు దేశంలో మూడో ప్రధాన పార్టీగా అది మారింది.దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలనే ఏకైక ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే ఆయన తాలిబన్ల పట్ల చూపే సానుభూతి కారణంగా వివాదాస్పదుడిగా మారారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వాళ్లలో ఇమ్రాన్ కూడా ఉన్నారు. వారసత్వ రాజకీయాలను కూడా అనేక సార్లు విమర్శించారు. పాకిస్తాన్‌లో పాలనా పరమైన లోపాలకు, బలహీనమైన అధికార వ్యవస్థకు అవే కారణమని ఇమ్రాన్ అంటారు.అధికారంలో లేకపోయినా సైన్యంతో మంచి సంబంధాలు నడిపిన వ్యక్తి ఇమ్రాన్. ప్రస్తుత సైన్యం కూడా ఇమ్రాన్ కు అనుకూలమే. అసలు ఈ ఎన్నికల్లోనూ సైన్యం కీలక పాత్ర పోషించింది. ఇమ్రాన్ కు అనకూలంగా పనిచేసందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు భారత్ తో సంబంధాల విషయంలో ఇమ్రాన్ కాస్త ఇబ్బందికరమైన ప్రధాని అవుతారని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని ఇమ్రాన్ గతంలో ఆరోపించారు. ‘పాక్‌ను ఒంటరి చేయడమే మోదీ ప్రభుత్వ పాలసీ కావొచ్చు. వాళ్లు పాకిస్తాన్‌కు చాలా వ్యతిరేకం. కశ్మీర్‌లో వాళ్లు చేసే పనులకు పాక్‌ను నిందించాలన్నదే మోదీ ఉద్దేశం’ అని గతంలో అన్నారు. అయితే… నరేంద్ర మోదీ మాదిరిగానే ఇమ్రాన్ కూడా సోషల్ మీడియాలో అమితమైన ఫాలోయింగ్ సాధించారు. పాకిస్థానీ యూత్‌లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రొఫైల్:
జననం: 25 నవంబర్ 1952, లాహోర్‌లో
చదువు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
ఇమ్రాన్‌ ఖాన్‌కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య, యూకేకు చెందిన జేమీమా గోల్డ్ స్మిత్. (విడాకులు తీసుకున్నారు)
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఇమ్రాన్ మాజీ కెప్టెన్. ఆయన సారథ్యంలోనే పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది.
రాజకీయ పార్టీ: 1996లో తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించారు.
1991లో షౌకత్ ఖానుమ్ మెమొరియల్ ట్రస్ట్‌ను ఇమ్రాన్ స్థాపించారు. 1994లో క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఓ ఆస్పత్రినీ నెలకొల్పారు.
2008లో ‘నమల్’ పేరుతో ఓ కాలేజీని మొదలుపెట్టారు.
‘ఇమ్రాన్- ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్’, ‘ఇండస్ జర్నీ- ఏ పర్సనల్ వ్యూ ఆఫ్ పాకిస్తాన్’, ‘ఆల్ రౌండ్ వ్యూ’ లాంటి ఆరు పుస్తకాలను ఇమ్రాన్ రచించారు.
పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద పౌర పురస్కారం ‘హిలాల్-ఇ-ఇంతియాజ్‌’ను అందుకున్నారు.
యూకేలోని బ్రాడ్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గానూ ఉన్నారు.

Related Posts