డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మూత్రనాళాల ఇన్ప్‌క్షన్ కారణంగా బాధ పడుతున్నారని, ఈ కారణంగా జ్వరం వచ్చిందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన చికిత్స అందిస్తున్నామని, ఫ్లూయిడ్స్ ఇస్తున్నామని చెప్పారు. కరుణానిధి నివాసంలోనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడటంతో అభిమానులు, నేతలు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి వస్తున్నారు. అయితే.. కరుణానిధికి విశ్రాంతి అవసరమని, ఆయణ్ని చూసేందుకు సందర్శకులను అనుమతించరాదని వైద్యులు సూచించారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఆయన క్షేమంగానే ఉన్నారని ఆయన తనయుడు, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం కరుణానిధి వయసు 96 ఏళ్లు. 2016 డిసెంబర్‌లో జయలలిత మృతి చెందిన కొద్ది రోజులకే కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా ఆయణ్ని చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కరుణానిధిని పరీక్షించిన వైద్యులు భుజంలో ‘ట్రకియోస్టమీ’ పరికరాన్ని అమర్చారు. నాటి నుంచి ఆయన వీల్ చైర్‌కే పరిమితమయ్యారు.చికిత్స అనంతరం కోలుకున్న కరుణానిధి గోపాలపురంలోని తన నివాసానికే పరిమితమయ్యారు. కావేరీ ఆస్పత్రి వైద్యులు ఆయన నివాసానికే వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి ‘ట్రకియోస్టమీ’ పరికరాన్ని మార్చుకోవాల్సి ఉండగా.. జూన్ 18న ఆస్పత్రికి వెళ్లిన కరుణానిధి చికిత్స అనంతరం ఇంటికి తిరిగివెళ్లారు