రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహించలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఇంత కాలం అడ్మిషన్లను చూపించి కాలం గడిపిన కాలేజీల యాజమాన్యాలు ఈసారి అది కూడా దక్కక పోవడంతో లబోదిబోమంటున్నాయి. ఈ ఏడాది ఐదు కాలేజీల్లో కనీసం ఒక్కరు కూడా చేరలేదు. దాంతో కాలేజీ నిర్వహణ తమ వల్ల కాదని, ఉన్న విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేయాలని వారు కోరుతున్నారు. ఆరు కాలేజీల్లో చేరిన విద్యార్ధులు మొత్తం చూస్తే 30 కూడా దాటలేదు. 29 కాలేజీల్లో కనీసం 10 శాతం విద్యార్ధులు కూడా చేరలేదు. వీటిలో 50లోపు అడ్మిషన్లు మాత్రమే జరిగాయి. 55 కాలేజీల్లో 100లోపు అడ్మిషన్లు జరిగాయి. 12 యూనివర్శిటీ కాలేజీల్లో, 33 ప్రైవేటు కాలేజీల్లో మాత్రమే 100 శాతం అడ్మిషన్లు జరిగాయి.ఎమ్సెట్ తుది విడత కౌనె్సలింగ్ ప్రక్రియ నాడు పూర్తికావడంతో వాస్తవ పరిస్థితిపై స్పష్టత వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69782 సీట్లు ఉండగా, అందులో రెండో దశలో చేరిన వారు 46,389 కాగా, తుది దశ కౌనె్సలింగ్ సమయానికి 23393 సీట్లు మిగిలాయి. తుది దశ కౌనె్సలింగ్ కలిపి ఇంత వరకూ 49170 మంది చేరారు. తుది దశలో 2781 సీట్లు భర్తీ చేశారు. చివరికి 20612 సీట్లు మిగిలిపోయాయి. ఇంత వరకూ 7168 మంది స్లయిడింగ్‌లో సీట్లు పొందారు. కాలేజీల వారీ చూస్తే ఇంజనీరింగ్‌లో 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3057 సీట్లకు 2970 భర్తీ అయ్యాయి. ఇంకా 87 సీట్లు మిగిలి ఉన్నాయి. ప్రైవేటులో 176 కాలేజీల్లో 63001 సీట్లకు 46012 సీట్లు భర్తీ కాగా, 16,989 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బిఫార్మసీలో 3 ప్రభుత్వ కాలేజీల్లో 80 సీట్లకు 24 భర్తీ అయ్యాయి. 114 ప్రైవేటు కాలేజీల్లో 3144 సీట్లకు 110 భర్తీ అయ్యాయి. ఫార్మా డీని ఆఫర్ చేస్తున్న 51 కాలేజీల్లో 500 సీట్లకు 54 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే 307 కాలేజీల్లో 69782 సీట్లకు 49170సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయినందున , సీట్లు పొందిన వారు ఈ నెల 27వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ సూచించారు.