ప్రభుత్వం పిచ్చి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సును విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ భేటీలో పవన్‌తో పాటూ వడ్డే శోభనాద్రీశ్వర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతోపాటు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు పాల్గొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన భూసేకరణ బాధితులు కూడా హాజరయ్యారు. సమావేశంలో నేతలు, ప్రముఖులు, మేధావుల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. అలాగే భూ నిర్వాసితుల ఇబ్బందుల్ని కూడా ఆరా తీశారు. సమావేశంలో ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ మండిపడ్డారు. ‘చంద్రబాబు చాలా తప్పు చేస్తున్నారు. సీఎంను నేను కలిసినప్పుడు రాజధాని 1850 ఎకరాల్లో నిర్మిస్తామన్నారు.. అది కూడా అటవీ ప్రాంతమనే చర్చకు వచ్చింది. ఇప్పుడేమా అది లక్ష ఎకరాలను చేరింది.. ఏం బాధ్యాతయుతమైన అభివృద్ధిని చేయలేరా. పర్యావరణం ఎలా నాశనమవుతుందో పశ్చిమగోదావరి జిల్లాను చూస్తే అర్థమవుతుంది ’. పిచ్చి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం. ఏం అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా.. ప్రజలు గమనిస్తున్నారు.. తోలు తీస్తారు గుర్తు పెట్టుకోండి. భూ దోపిడీపై న్యాయ, రాజకీయం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేసేందుకు సిద్ధం. అందరం వచ్చి సీఎం ఇంటి ముందు కూర్చుంటాం. అమరావతిని ఆపేస్తాం.. రాజధానిని అడ్డుకుంటాం. ఒకవేళ కేసులు పెడితే ఎదురు తిరగండి.. అండగా నేను ఉంటానన్నారు’ పవన్.ప్రభుత్వం నా విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. శ్రీకాకుళంలో పోలీసు భద్రత ఇవ్వలేదు. నేను పాదయాత్ర చేస్తుంటే ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు అలా వ్యవహరించారని అనుకుంటున్నా. నేను ప్రజల్ని కదిలించగలను.. నన్ను ఎవరూ డబ్బుతో కొనలేరు. చంద్రబాబు రాహుల్‌కు కొన్ని కొట్టి మనమంతా ఒక్కటే అనగలరు. పొత్తులపై ఎన్నికల సమయంలో ఆలోచిస్తా.. ఇప్పుడు ఉద్యమాలేనన్నారు’ జనసేనాని.