YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వానలు పడినా తడవని గొంతు

వానలు పడినా తడవని గొంతు

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితి. గోదావరి పక్కనే ఉన్నా.. లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా జిల్లా ప్రజలను తాగునీటి కష్టాలనుంచి గట్టెక్కించలేని దయనీయ పరిస్థితి. చాలాచోట్ల ఈ పరిస్థితి ఉండగా నగర, పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల 50 శాతం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు. నగర, పురపాలక సంఘాల్లోని శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అరకొరగా అందిస్తున్నారు. లెక్కల్లో సరిపడా సరఫరా చేస్తున్నామని చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. నీటిని కొనుగోలు చేసుకునే వారి పరిస్థితి పక్కన పెడితే పేద ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.

వాస్తవానికి నిబంధనల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి సరిపడా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఆ లెక్కన ప్రతి వ్యక్తికీ రోజుకు తాగు,ఇతర అవసరాల నిమిత్తం 130 లీటర్ల నీటికి ఇవ్వాల్సి ఉంది. కాని అనేక ప్రాంతాల్లో అందుకు విరుద్ధంగా ఉంది. సగటున మనిషికి 50 లీటర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. శివారు, కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో ఆ పరిస్థితి కూడా లేదు. ఆకర్షణీయ నగరమైన కాకినాడలో సైతం శివారు ప్రాంతాలకు నీరందటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. స్వామినగర్‌, టీచర్స్‌కాలనీ, ఎస్‌.అచ్యుతాపురం వంటి ప్రాంతాలకు 50 శాతానికిపై తాగునీటి కొరత ఉంది. లెక్కల్లో మాత్రం అవసరానికి మించి సరఫరా చేస్తున్నట్లు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 45 నుంచి 50వ వార్డు వరకూ తక్కువ నీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా నగరంలో చాలా వార్డుల్లో ఈ పరిస్థితి ఉందని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుస్తోంది.

కొన్ని పురపాలక సంఘాల్లో పదేళ్ల కిత్రం జనాభా అంచనా ప్రకారం తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఒక ప్రాంతంలో అయిదు వేల మంది ఉంటే 130 లీటర్ల చొప్పున 6.50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులనే నిర్మించారు. అప్పటి అంచనాలకు జనాభా రెట్టింపైనా నీటి వనరులు మాత్రం పెరగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అదనపు నీటి నిల్వల కోసం ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నా నిధుల కొరత, గుత్తేదారుల అలసత్వం వల్ల నేటికీ అవి పూర్తికాని పరిస్థితి ఉంది. ఉదాహరణకు రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు 2010లో ప్రారంభించిన తాగునీటి ట్యాంకుల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. అమలాపురంలో ప్రతిపాదనలు దశలోనే ఉంది. ఇలా పలు చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి నిల్వ కోసం సరిపడ ట్యాంకులు ఉన్నప్పటికీ సరఫరా చేయడానికి సరైన పైపులేన్ల  వ్యవస్థ లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు నిల్వ సామర్థ్యం ఎక్కువగానే ఉంది. కాని ఆయా ప్రాంతాలకు పైపులైన్ల నిర్మాణం జరగలేదు. కొన్ని ఎగువ ప్రాంతాలకు నీరు ఎక్కని పరిస్థితి. కుళాయిలు ఉన్నా నీరు రాని దుస్థితి ఉంది. శివారు గ్రామాలకు నీరు తీసుకువెళ్లాలన్న సదుద్దేశంతో 10, 48, 50 వార్డుల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్లు పూర్తికాలేదు. పైగా ప్రస్తుతం ఉన్న పైపులైన్లు కూడా కాలం చెల్లినవి కావడంతో తరచూ లీకేజీలు ఏర్పడి నీరు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంది. కాకినాడలో కూడా ఇదే పరిస్థితి.

జిల్లాలోని పెద్దాపురం, బొమ్మూరు తదితర ప్రాంతాల్లో ఏర్పటు చేసిన కాలనీల్లో నీటికోసం కటకటలాడిపోతున్నారు. ట్యాంకులతో సరఫరా చేస్తున్నా దాదాపు రెండు నుంచి మూడు వేల మంది జనాభాకు రోజుకు ఒక్కసారే ఒక్క ట్యాంకు ద్వారా నీటిని ఇస్తుండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రత్యేకంగా నిర్మించిన మంచినీటి ట్యాంకుల్లో లోపాలు ఉండటం, పైపుల నిర్మాణం సక్రమంగా జరగకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.

Related Posts