చెన్నై కావేరి ఆస్పత్రిలో కరుణానిధి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె కనిమొళి స్పందించారు. ‘నాన్న కోలుకుంటున్నారు.. బీపీ కంట్రోల్ అయ్యింది.. నిన్నటితో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని’చెప్పారు. ఇటు కరుణను పరామర్శించేందుకు ప్రముఖులు, నేతలు కావేరి ఆస్పత్రికి క్యూ కట్టారు. ఉదయం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరుణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా చెన్నై వచ్చారు. కరుణకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరుణకు బీపీ పడిపోవడంతో అర్థరాత్రి 1.30 నిమిషాల సమయంలో చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సీనియర్ డాక్టర్లు పర్యవేక్షణలో.. ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చిన గంట తర్వాత హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. కరుణకు బీపీ పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. మరోవైపు కరుణను ఆస్పత్రికి తరలించారని సమాచారం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారు ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అక్కడ తోపులాట జరగడంతో.. పోలీసులు కార్యకర్తల్ని చెదరగొట్టారు. ఇప్పటికీ పార్టీ నేతలు ఆస్పత్రి దగ్గర భారీగా తరలివస్తున్నారు