YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పంకజ్ ముండే ను సీఎం చేయండి

పంకజ్ ముండే ను సీఎం చేయండి

విద్య, ఉద్యోగాల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణవీస్ ఎటువంటి పరిష్కారం చూపడంలేదని శివసేన విమర్శలు గుప్పించింది. పంకజ ముండేను ఒక్క గంట పాటు సీఎంను చేస్తే మరాఠా రిజర్వేషన్ల సమస్యను ఆమె పరిష్కరిస్తుందని శివసేన ఎద్దేవా చేసింది. ఇటీవల ఓ సభలో మంత్రి పంకజ ముండే మరాఠాల రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ... సంబంధిత ఫైలు తన వద్దకు వస్తే క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఎలాంటి సమస్య తలెత్తకుండా పరిష్కరిస్తానని అన్నారు. ఇదే విషయాన్ని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ప్రస్తావిస్తూ సీఎం ఫడణవీస్‌పై విమర్శనాస్త్రాలను సంధించింది. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే ప్రస్తుతం మహారాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలిగా ఉన్నారు. పంకజ ముండేను ఒక్క గంట పాటు సీఎంను చేస్తే మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని సమస్యలు ఎదురుకాకుండా పరిష్కరిస్తారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ విషయాన్ని రాజకీయం చేయాలని భావించడం లేదు... ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కూడా మంత్రి పంకజ అభ్యర్థించొచ్చు. మరి అలాంటిది సీఎం మాత్రం దీన్ని పరిష్కరించేందుకు ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘ఒక వేళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సహాయం తీసుకోవాలని ప్రయత్నించినా అది కూడా కష్టమేమో... ఎందుకంటే విదేశీ టూర్లతో ప్రధాని ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేసిన హార్దిక్‌ పటేల్‌‌ను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరాఠాల ఆందోళన విషయంలో కూడా ఇదే విధానాన్ని పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మరాఠా క్రాంతి మోర్చా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. శాంతియుతంగా సాగుతోన్న ఈ ఆందోళన ఔరంగాబాద్‌లో ఓ యువకుడు జులై 23 న ఆత్మహత్య చేసుకోవడంతో హింసాత్మకంగా మారింది. సీఎం ఫడణవీస్ తెల్లవారుజామున 3 గంటలకు వరకూ పనిచేస్తున్నారని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్న మాటలను కూడా సంపాదకీయంలో ప్రస్తావించారు. మరాఠాల అందోళనలు ఫడణవీస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని, అందుకే ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించింది. ఒకవేళ ఆయన కళ్లు మూస్తే పంకజ ముండే ఈ ఫైల్‌ను పరిష్కరిస్తారని, కాబట్టి మరాఠా సామాజిక వర్గం డిమాండ్లను నెరవేర్చాలని శివసేన సూచించింది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గం 30 శాతం వరకు ఉంటుంది. తమకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వీరు నినదిస్తున్నారు.

Related Posts