తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహాజాతర వైభవోపేతంగా సాగుతున్నాయి. జనజాతరలో మూడో రోజైన శుక్రవారం వనదేవతల దర్శనం కోసం వేల సంఖ్యలో కిలో మీటర్ల పొడవున భక్తులు బారులు తీరారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెల మీదకు చేరుకోగా...గురువారం సమ్మక్క కూడా గద్దెల మీదకు చేరుకోవడంతో జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. గద్దెల మీద నుంచి సమ్మక్క, సారక్క భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం మేడారం చేరుకున్నారు. గద్దెలపై కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మను వెంకయ్య దర్శించుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బంగారాన్ని వెంకయ్యనాయుడు అమ్మవార్లకు సమర్పించారు. మరోవైపు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారంకు రానున్నారు. మధ్యహ్నం వనదేవతలను దర్శించుకుని.. తులాభారం తూగి నిలువెత్త బంగారాన్ని తల్లులకు కానుకగా ఇవ్వనున్నారు. ఉపరాష్ట్రపతి, సీఎం రాకతో మేడారం జాతర ప్రాంగణంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.