కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి కాంగ్రెస్ హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్‌ను ప్రారంభించారు.ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్‌కు ఉంది. అయితే ఎయిర్‌పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్‌లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది.