YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆగస్టు 11న పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం

ఆగస్టు 11న పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం
 పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తానని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ వెల్లడించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చర్చలు జరుపుతున్నామని.. వచ్చే నెల 11న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు.ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పీటీఐ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇమ్రాన్‌ ఈ వివరాలను వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రజల ప్రయోజనాల మేరకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నట్లు ఇమ్రాన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.జులై 25న జరిగిన పాకిస్థాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీటీఐ పార్టీకి 116సీట్లు వచ్చాయి. అయితే పాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. వీరిలో 137 మంది నేరుగా పార్లమెంట్‌కు ఎన్నికవ్వాలి. దీంతో చిన్నపార్టీలు, స్వతంత్రులతో పీటీఐ పార్టీ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే జీడీఏ, ఎంక్యూఎం-పీ, పీఎంఎల్‌-క్యూ, అవామీ ముస్లిం లీగ్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇమ్రాన్‌ పార్టీకి మద్దతు 122కు పెరిగింది. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ను అడ్డుకునేందుకు పాక్‌లోని మరో రెండు ప్రధాన పార్టీలైన పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌లు వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంటులో పీటీఐని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 25న జరిగిన పాక్‌ జాతీయ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

Related Posts