రచయిత : వనం జ్వాలా నరసింహా రావు గారు.
శ్రీమతే నారాయణాయనమః అనేక మంగళాశాసనములు!
శ్రీరాముడు మానవుడా? దేవుడా? శ్రీరామాయణంలో చదివేదంతా జరిగినదా? లేక వాల్మీకి మహర్షి చేసిన ఒక అద్భుతమైన కల్పనమా? మనుష్యులు, కోతులు, రాక్షసులు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటారా? అందరికీ వ్యావహరికంగా ఉపయోగపడే భాష ఒకటుండేదా? ఇలా శ్రీరాముడి చరిత్ర తెరవగానే తీగల తంపరలా ప్రశ్నల పరంపరలిప్పటివాళ్లను వేధిస్తూనే వుంటుంది.
ఏ చరిత్ర అయినా జరిగే కాలంలో అందరికీ తెలుస్తుంది. ఆ తరువాతి వారికి కొంత తెలుస్తుంది. ఓ వంద సంవత్సరాలు గడిస్తేనే అది అవునో, కాదో అనిపిస్తూనే వుంటుంది. అలాంటిది వేల, లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చరిత్రను యథాతథంగ అంగీకరించడం కొంత కష్టమే .
అయినా కొన్ని వాస్తవాలు అంగీకరించక తప్పదు. శ్రీరామ చరిత వాల్మీకి కల్పించినది కాదు. జరిగినది జరిగినట్లు తాను చూచినది చూచినట్లు వ్రాసుకున్నాడు. ఇందులో తన స్వంతం అంటూ ఏమి లేదని తానే చెప్పుకున్నాడు. ఓ మనిషి కథ వ్రాస్తున్నాను అని ప్రారంభించాడు. శ్రీరాముడు ‘పుట్టక ముందు’ ‘విష్ణువు’ అవతారం అయిపోయాక తిరిగి శ్రీ మహావిష్ణువు.
కానీ అవతరించి ఉన్న రోజులలో మాత్రం తాను మనిషినే అంతేననుకున్నాడు. మనిషి మనిషిగా ఉంటె జంతువులూ, రాక్షసులు, దేవతలు అనే తేడా లేకుండా అందరూ అతనికై జీవిస్తారు. అతనిపై జీవిస్తారనేది ఈ రామాయణంలో తెలుస్తుంది. అందుకోసం ఓ భాష అవసరమే లేదు. భావమే చాలును అనేది శ్రీరాముడు నిరూపిస్తాడు. కాకపోయినా ఆ రోజుల్లో సంస్కృతం అందరికి అర్థమయ్యే ప్రధాన భాషగా వుండేది కాబోలు.
మనష్యులు దేవతల దయకై అర్రులు చాచనక్కరలేదు. దేవతలే తమ అవసరాలకై మనుష్యుల వెంట పడతారనేది రామాయణంలో ప్రధానంగా కనిపిస్తుంది.
తన చుట్టూ వుండి తనపై ఆధారపడ్డ ప్రజల సుఖం ప్రధానమైనది. తన సుఖం తరువాతనే చూచుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెప్పే ముందుగ తన కర్తవ్యాన్ని నిర్మొగమాటంగ పాటించి తీరాలనే మానవతా సూత్రాలకి మొదటి ఉదాహారణ శ్రీరాముడే కనుక అతని గురించి వ్రాయని కవి ఇలలో ఉండనే ఉండడంటే అతిశయోక్తి అనిపిస్తుంది. కాని వాస్తవం. తన బాధ్యతలను నెరవేర్చుకోవడంలో చేసిన అనేక కృత్యాలు అప్పుడప్పుడు పదుగురి విమర్శలకు తావిచ్చినా శ్రీరాముడు ఎవ్వరికీ వెరువలేదు.
తన కర్తవ్యాన్ని మానలేదు.విమర్శించిన వారే దోషం గుర్తించుకుని విరమించాడే తప్ప శ్రీరాముణ్ణి అనలేకపోయారు. అందుకే మానవుడిగ బ్రతకాలనుకున్నవారేవరైనా శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకోకుండా ఉండలేకపోయారు.
ఆదికవిగా వాల్మీకిని చేస్తూ సంస్కృతంలో వెలిసిన ఈ ఆదికావ్యాన్ని యధాతథంగ తెలుగులోకి పద్య కావ్యంలా 24 వేలు పద్యాలతో కూర్చి తెలుగుకి ఆదికవి శ్రీ వాసుదాసస్వామి చేశారు. వావిలకొను సుబ్బారావుగ లౌకిక విద్యా వాసంగముల సారమును చూచి, వాటిని పరిత్యజించి అవధూతగ తపస్సంపన్నులైన శ్రీవాసుదాసస్వామి తెలుగులో ఉండే అన్ని అందాలను ఇందులో పొందుపరచి శ్రీరామాయణంగా మార్చారు.