వచ్చే నెల ఆగస్టు 15 నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలకు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం చేపట్టారని ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 61820 మంది రైతులు పోలవరం సందర్శించారని, పోలవరం ఆధునిక దేవాలయమని, సీమాంధ్ర ప్రజలందరూ ఒక్కసారైనా ఆ దేవాలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాజధాని కోసం రైతులు 34వేల ఎకరాలు ఇస్తే ఢిల్లీ తలదన్నే నగరాన్ని నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నట్లు చెప్పారు. మూలపాడు వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిధ్దం చేసామని తెలిపారు. లబ్ధిదారులు వారికి అనువైన రీతిలో గృహనిర్మాణం చేసుకోవచ్చని 500 నుండి 750 అడుగుల వరకు ఇల్లు కట్టుకోవచ్చని తెలిపారు. 9ఏళ్లు నన్ను తిట్టినోళ్లు అడ్రస్ లేరని, కొత్తగా తిట్టేందుకు ఏ7 ముద్దాయి వచ్చాడని విమర్శించారు. 1999లో కొడుకు, 2004 తండ్రి నాపై పోటీ చేసారని, 30 ఏళ్లు రోడ్డున వెళ్తూ కూడా ప్రజల్ని పలకరించిన పాపాన పోలేదని ఆరోపించారు. 1983 నుండి దేవినేని కుటుంబం అసెంబ్లీలో ఉందని, నందిగామ నియోజకవర్గం తన రాజకీయ భవిష్యత్ కు పునాది వేస్తే, మైలవరం నియోజకవర్గం ఆ పునాదిపై చక్కని బిల్డింగ్ కట్టిందని ఈ సందర్భంగా రెండు నియోజకవర్గాల ఓటరు మహాశయులకు శిరసు వంచి అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వారం పదిరోజుల్లో 130 మంది ఆడపడుచులకు చీరె, పుసుపు కుంకుమలతో ఇళ్ళ పట్టాలు అందజేస్తానని అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఉమా ఆదేశాలిచ్చారు. 340 ఎకరాలకు ఉన్న జూపూడి పంపింగ్ స్కీం మరమ్మత్తులకు రూ.19.90లక్షలు మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రూ.15లక్షలతో నిర్మించిన పంచాయితీ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేసారు. 22 డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు రూ.32.50లక్షల చెక్కును మహిళలకు అందజేసారు.