కాపులకు రిజర్వేషన్ల సెగ వైసీపీ అధినేత జగన్‌కు గట్టిగా తాకుతోంది. ఓవైపు పాదయాత్రలో కాపు నేతలు నిరసనను తెలియజేస్తుంటే.. ఇటు రాజకీయంగా కూడా విమర్శలు మొదలయ్యాయి. ఇదే అంశంపై జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు విరుచుకుపడుతున్నాయి. కాపుల రిజర్వేషన్లపై జగన్ చేతులెత్తేశారని విమర్శించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అసెంబ్లీలో రిజర్వేషన్లకు మద్దతిస్తామని చెప్పి.. ఇప్పుడు మాట మార్చరడం దారుణమన్నారు. కేంద్రంపై పోరాడే సత్తా ఆయనకు లేదని.. అందుకే అసహనంతో ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్‌కు దమ్ముంటే కాపుల రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై పోరాడాలని సవాల్ విసిరారు.కాపుల రిజర్వేషన్ల విషయంలో జగన్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ. వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తామని.. ఇప్పుడు కుదరదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కాపులకు అండగా ఉంటామని.. అలాగే రిజర్వేషన్లకు తమ మద్దతు ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతోందని వ్యాఖ్యానించారు చాందీ.