ఏపీ పీసీసీ చీఫ్.. రఘువీరారెడ్డి.. నానా కష్టాలుపడి నాలుగేళ్లపాటు హస్తాన్ని లాక్కొచ్చారు. పదేళ్లు పదవులు అనుభవించిన నేతలంతా.. తలా దిక్కు చూసుకున్నా.. తాను మాత్రం పార్టీను నమ్ముకుని హస్తం జీవం కోల్పోకుండా కాపాడుతూ వచ్చారు. 2019లో హస్తం కనీసం కొన్ని సీట్లయినా గెలిస్తే ప్రతిపక్ష హోదాలో ఉండాలని ఆశపడుతున్నారు. సీమ నుంచి కోనసీమ వరకూ అందరితో టచ్‌లో ఉంటూ ముందుకు సాగుతున్నారు. కానీ.. హఠాత్తుగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పునః ప్రవేశంతో డైలమాలో పడ్డారనే ప్రచారం సాగుతోంది. నాలుగేళ్లు ఇప్పటి వరకూ కాపాడినా వలస నేతలకే వత్తాసు పలుకుతున్నారనే ఆవేదన కూడా వెలిబుచ్చుతున్నారట. ఆయన మాటల్లోనూ నిజం దాగుందనే చెప్పాలి. కానీ.. నల్లారి మాత్రం మీడియా సమావేశాల్లో తాను కేవలం అదిష్ఠానం ఆదేశాలను పాటించే కార్యకర్తను మాత్రమే అంటున్నారు. సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని ఆశ కూడా లేదంటున్నారు. రఘువీరా, తాను ఇద్దరం 1989లో ఒకేసారి ఎమ్మెల్యేగా అయ్యామంటూ మేమిద్దరం మంచి దోస్తులమనే సంకేతాలు పంపుతున్నారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అయిన సమయంలో ఉమ్మడి రాష్ట్రం కావాలంటూ మొండిపట్టుపట్టి ఏపీ ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అదిష్ఠానాన్ని సైతం దిక్కరించి ఉమ్మడి రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించటంలో సాయం అందించారు. అటువంటి సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై చేసిన కామెంట్స్‌కు గట్టి జవాబు చెప్పించారు.రాష్ట్రం నలువైపులా కేసులు నమోదుచేయించేందుకు అనుకూలంగా నల్లారి సీఎం సహకరించారనే విమర్శలున్నాయి. మహవీర్ ఆసుపత్రి స్థలంపై కన్నేసిన ఎంఐఎంకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఫైలుపై సంతకం చేయకుండా వెనక్కి పంపారు. నెలరోజులు పదవీకాలం ఉండగానే సీఎం పీఠానికి రాజీనామా చేసి.. ఏపీ ప్రజల దృష్టిలో హీరో అయ్యారనే చెప్పాలి. హస్తం నుంచి బయటకు వచ్చి ఏకంగా పార్టీ పెట్టి.. చెప్పుల గుర్తుపై పోటీచేసినా.. డిపాజిట్టు కూడా సాధించలేకపోయారు. అయినా.. ఇప్పటికీ ఏపీ ప్రజల్లో కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంచి నమ్మకం ఉందనేది కాంగ్రెస్‌పార్టీ భావిస్తున్న నిజం. అందుకే.. పిలిచిమరీ.. పార్టీలో చేర్చుకున్నారు. స్వయంగా రాహుల్ నేనున్నానంటూ భరోసానిచ్చారు. ఇదే.. ఇప్పుడు రఘువీరారెడ్డి కలవరానికి అసలు కారణమట.