ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీని ఓ సమస్య వెంటాడుతోంది. ఏపీలోని పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. ఇప్పటికీ ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దించుతారన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా నాలుగైదు స్థానాల్లో బలమైన అభ్యర్థులు కానరావడం లేదు. గుంటూరు, బాపట్ల, మచిలీపట్నం, విజయవాడ తదితర పార్లమెంటు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ అధిష్టానం వెతుకుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్గాలు కూడా కొంత ఆందోళన చెందుతున్నాయి. ఆయా స్థానాల్లో అధికార టీడీపీని ఎదుర్కొనే నేతలెవరూ కానరావడం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసిన కోనేరు ప్రసాద్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇక్కడి నుంచి సిట్టింగ్ టీడీపీ ఎంపీ కేశినేని నాని మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఈ కీలక సెగ్మెంట్‌లో వైసీపీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ సరైన అభ్యర్థిని ఇప్పటికిప్పుడు రంగంలోకి దించేతే ఆయన ఇప్పటి నుంచి జనాల్లోకి వెళితే గాని టీడీపీకి సరైన పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీలో చేర్చుకుని విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొన్ని రోజులు పురందేశ్వరి వైసీపీలోకి వస్తున్నారనే ప్రచారం జోరుగు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె వైసీపీ తరుపున విజయవాడ నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మచిలీపట్నం నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన బాలశౌరిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన కూడా పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఒకవేళ ఆయన కూడా నో చెబితే మరో అభ్యర్థిని చూసుకోవాల్సిందే. 2004లో అప్పటి తెనాలి ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత 2009లో నరసారావుపేటలో 2014లో గుంటూరులో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. దీంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆయన పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదట. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయన్ను ఈ సారి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలశౌరి పేరును మచిలీపట్నం ఎంపీ రేసులో పరిశీలిస్తున్నారు.అయితే ఒక్క గుంటూరు లోక్‌సభ స్థానంలో మాత్రం కొంత క్లారిటీ ఉందనే చెప్పాలి. ఇక్కడి నుంచి విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య వారసుడు శ్రీకృష్ణదేవరాయులు పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే గుంటూరు లోక్‌సభ సీటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యువకుడు, ఉన్నత విద్యాసంస్థల అధినేత కుమారుడు కావడంతో త్వరగానే జనాల్లోకి దూసుకుపోయారు. ఇక నరసారావుపేటలోనూ 2014లో పోటీచేసిన అయోధ్య రామిరెడ్డి ఇప్పుడు వ్యాపారాలకు పరిమితం కావడంతో కొత్త వారిని వెతకాల్సిందేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆయన పోటీ చేసేందుకు అంత ఆసక్తిగా లేరని పార్టీ వర్గాలే చెపుతున్నాయి.ఇక ప్రకాశం సిట్టింగ్ స్థానం విషయంలోనూ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వైవీ సుబ్బారెడ్డికే మళ్లీ టికెట్ ఇస్తారా..? లేక షర్మిలను తీసుకొస్తారా..? అన్న విషయంలో క్లారిటీ లేదు. సుబ్బారెడ్డిని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయించకుండా పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అమ్మ హాస్పిటల్ యజమాని వరికూటి అమృతపాణి రాజకీయాల్లో ప్రస్తుతం చురుగ్గా కొనసాగడం లేదు. అయితే, టీడీపీలో అసంతృప్తిగా ఉన్న రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరతారని, ఆయనకే బాపట్ల టికెట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ కీలక ఎంపీ సెగ్మెంట్ల విషయంలో జగన్ ముందుగా అభ్యర్థులను ప్రకటించకపోతే ఎన్నికల వేళ పార్టీకి అది పెద్ద మైనస్సే అయ్యేలా ఉంది.