తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తిరుమల తరహా దర్శనాలను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో ముణిరత్నం రెడ్డి తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రాత్రి 7.00 నుంచి 7.30 గంటల వరకు వీఐపీ దర్శన సమయంగా కేటాయించినట్లు చెప్పారు. తిరుమల తరహాలో తిరుచానూరులోనూ వీఐపీ బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు.తిరుమల తరహాలోనే వీఐపీ దర్శనం పరిధిలోకి వచ్చే ప్రముఖులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తిరుచానూరు ముణిరత్నం రెడ్డి తెలిపారు. ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. అమ్మవారి ఆర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శన వేళల సమయాన్ని అదనంగా మరో గంటపాటు పొడిగించాం. ఉదయం 4.30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9.30 గంటలకు మూసివేస్తాం. అమ్మవారి కుంకుమార్చన సేవా సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు యథావిధిగా కొనసాగిస్తాం’ అని ముణిరత్నం రెడ్డి చెప్పారు.