వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సర్దుబాటు చేసే ప్రయత్నంలో పడ్డారు ఆపార్టీ నేతలు. జగన్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలోని కాపు నేతలు కుమిలిపోతున్నారు. తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ చిల్లుపడుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని, అవి కేంద్రం పరిధిలో ఉన్నాయి కాబట్టి దానిపై ఎటువంటి హామీ ఇవ్వలేనని జగన్ చెప్పారు. దీంతో వైసీపీలోని కాపు నేతల్లో కలకలం రేగింది. జగన్ నిర్ణయంగా, నిర్మొహమాటంగా చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ దాన్ని అందిపుచ్చుకుంది.కాపు రిజర్వేషన్లపై జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే హామీ ఇచ్చారని, జగన్ కాపు రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాడకుండా యూటర్న్ తీసుకున్నారని టీడీపీ నేతలు ఫైరయ్యారు. కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు ఒక్కరే కట్టుబడి ఉన్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జగన్ పై మండి పడ్డారు. కాపు జాతిని అవమానపర్చిన జగన్ పార్టీకి ఓట్లు ఎవరు వేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి జగన్ ఎందుకు మద్దతు ప్రకటించారో చెప్పాలని ముద్రగడ నిలదీశారు. వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. కాపు నేత, వైసీపీలో సీనియర్ లీడర్ అంబటి రాంబాబు ఈ అంశాన్ని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జగన్ వ్యాఖ్యలను కొందరు కావాలనే పక్కదోవ పట్టించారన్నది అంబటి రాంబాబు వాదన. రాజకీయంగా లబ్ది పొందేందుకే జగన్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుని తెలుగుదేశం పార్టీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశంపార్టీ నాలుగేళ్లు నాన్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుందన్నారు.జగన్ ఉద్దేశ్యం కాపు రిజర్వేషన్లు అవసరం లేదని కాదని అంబటి వివరణ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలో లేనని మాత్రమే జగన్ అన్నారని, కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని అంబటి వివరణ ఇచ్చుకున్నారు. వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు. ముద్రగడ పద్మనాభం సయితం వైసీపీ పైన, జగన్ పైన ఆరోపణలు చేయడం బాధాకరమని అంబటి అన్నారు. జగన్ కు కాపు రిజర్వేషన్ల అంశం పట్ల చిత్తశుద్ధి ఉందని అంబటి చెప్పారు. మొత్తం మీద వైసీపీ జగన్ వ్యాఖ్యలను సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో పడింది.