జలయజ్ఞం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న వైఎస్ జగన్ కు రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. సబ్జెక్టు తెలీకుండా జగన్ మాట్లాడుతుంటారని, ఆయనకు కౌన్సెలింగ్ అవసరమని అన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 56.90 శాతం, తవ్వకం పనులు 76.60 శాతం, కాంక్రీట్ పనులు 31.60 శాతం పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారన్నారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 62.41 శాతం పూర్తి అయ్యిందన్నారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67 శాతం, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయని, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 30 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టారని వెల్లడించారు. మొత్తం 56 ప్రాధాన్య ప్రాజెక్టులని మంత్రి దేవినేని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైనవి 9 అని, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి 6 ప్రాజెక్టులు అని తెలిపారు. పనులు కొనసాగుతున్నవి 26 ప్రాజెక్టులన్నారు. కొత్తగా చేపట్టినవి 15 ప్రాజెక్టులన్నారు. ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని, అలాగే సంగం-నెల్లూరు బ్యారేజ్‌లు నిర్దేశిత సమయానికి నిర్మించాలని, వాటి గడువు పెంచేందుకు వీలు లేదని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలని, వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మొదటిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఆగస్టు 15 కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా వున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న 960 మెగా వాట్ల పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 2009లో జగన్ ప్రయత్నించారన్నారు. దీనివల్లే 2009లో ఖరారు కావాల్సిన టెండర్లు 2013లో ఓకే అయ్యాయన్నారు. జగన్ అవినీతి కారణంగా పోలవరం పనుల్లో జాప్యం చేసుకుందన్నారు. ఓట్లు దండుకోడానికి గ్రామాలోల కేవలం కాలువలు మాత్రమే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా పులివెందులకు నీరిచ్చామన్నారు. ఇది కూడా జగన్ చూడలేకపోతున్నారన్నారు. జగన్ కళ్లకు పురుషోత్తమపట్నం, ఏలేరు రిజర్వాయర్లలో నీళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కోర్టులో హాజరు కావడానికి, తన వ్యాపారాల లెక్కలు చూడడానికి హైదరాబాద్ వెళ్లడానికి సమయం ఉంటుందిగాని, పులివెందుల వెళ్లి తామిచ్చిన నీటిని చూడడానికి టైమ్ లేదా? అని జగన్ ను ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి బిక్ష పెడుతున్న పులివెందులకు కృష్ణా జలాలు ఇవ్వడం జగన్ కు ఇష్టంలేదన్నారు. త్వరలోనే జగన్ కు పులివెందుల ప్రజలు ప్రొగ్రెస్ రిపోర్టు ఇస్తారని మంత్రి అన్నారు. జీతాలు తీసుకుంటూ, బడి ఎగ్గొట్టిన బడి పిల్లల మాదిరిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఊళ్లో తిరుగుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి జగన్, వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. జగన్ లెక్కలు తేలుస్తానని, ఆయన నాటకాలు బయటపెడతానని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని చేసిన దోపిడి కారణంగానే జగన్ జైలుకెళ్లారన్నారు. ఒక సీఎం కొడుకు 16 నెలలు జైల్లో ఉండడం సిగ్గుచేటన్నారు. ఇంతవరకూ 65 వేల మంది రైతుల పోలవరం ప్రాజెక్టు సందర్శించారన్నారు. 80 ఏళ్ల వృద్ధుడు తనను కలిసి, పోలవరం ప్రాజెక్టు నిర్మానం బాగుందన్నారు. తనకు మరింత కాలం జీవించాలని ఉందని అన్నారన్నారు. అధికారం రాలేదని దుగ్ధతో జగన్ రగిలిపోతున్నారన్నారు. వయస్సు పెరిగితే సరిపోదని, హుందాగా నడుచుకోవాలని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరరావును ఉద్దేశించి మంత్రి దేవినేని వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ తీరు వల్లే రాష్ట్రానికి రావాల్సిన వోక్సో వాగన్ రాకుండా పోయిందన్నారు. అనంతపురంలో ప్రారంభించిన కియా కంపెనీ కార్లు వచ్చే జనవరి నాటికి రోడ్ల మీద పరుగులు తీస్తాయన్నారు. అనంతపురం కియా కంపెనీ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోందన్నారు. భూములకు విలువ పెరిగిందన్నారు. అమరావతికి వచ్చిన తొలినాళ్లలో చెట్ల కింద బస్సులు నిలిపి పాలన సాగించామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పరిపాలనా దక్షత కారణంగా నేడు పెద్ద పెద్ద భవనాల్లో పాలన సాగిస్తున్నామన్నారు. అమరావతిలో విశాలమైన రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇవేవీ జగన్ కు కనిపించడంలేదా? అని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. పోలవరం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,457 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇంతవరకూ రూ.6,724 కోట్లు ఇచ్చారన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టులా ఏ ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చుల వినియోగం ఆన్ లైన్లో పొందుపర్చలేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఇంత వరకూ 69 వర్చువల్ సమావేశాలు, 20 పర్యాయాలు పనులను స్వయంగా పరిశీలించారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చేసిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు లేఖలు రాస్తారా? అంటూ కేవీపీపై మంత్రి ఫైర్ అయ్యారు. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్న జగన్ కు ఎందుకు లేఖలు రాయడంలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసిన టీడీపీ ఎంపీలను సన్మానిస్తే తప్పా అని నిలదీశారు. ఎందుకీ పైత్యమని వైసీపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు.