బాలీవుడ్‌లో గ్యాఫర్ (చీఫ్ లైటింగ్ టెక్నీషియన్)గా పని చేస్తున్న ఉన్న ఏకైక మహిళ హెతల్ డేదియా.తానెందుకు ఈ వృత్తిలోకి వచ్చానో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆమె బీబీసీతో పంచుకున్నారు.''గ్యాఫింగ్ అనేది చాలా కష్టమైన వృత్తి. సీన్‌లకు తగ్గట్టుగా షూటింగ్ స్పాట్‌లో వెలుతురును సృష్టించగలగాలి. కెమెరా సెట్టింగ్‌లకు తగ్గట్టుగా లైట్ సెటప్ మార్చాలి" అని ఆమె గ్యాఫింగ్ కష్టాలను వివరించారు.ఇలాంటి భిన్నమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా..''ఈ వృత్తిలో మహిళలు లేకపోవడం వల్లే దీన్ని ఎంచుకున్నాను. ఇప్పటికీ ఇందులో ఉన్న ఏకైక మహిళను నేనే. గ్యాఫెర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఏమీ అనుకోలేదు'' అని హెతల్ చెప్పారు.
గ్యాఫింగ్ చేయడంలో చాలా ఇబ్బందులుంటాయని ఆమె పేర్కొన్నారు. ''కొన్నిసార్లు రోజుకు 18 గంటలు పని చేయాలి. ఒక పని అయిపోయిన వెంటనే మరో పని ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఈ పనికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది'' అని తెలిపారు.లక్కీ బై ఛాన్స్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, బ్లఫ్ మాస్టర్ తదితర చిత్రాలకు హెతల్ పని చేశారు.పురుషాధిక్యం ఉండే ఈ రంగంలో హెతల్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.బాలీవుడ్‌లో ఎవరూ తనను అగౌరవంగా చూడలేదని, అయితే మహిళలు ఇలాంటి పని చేయడానికి సరైన ప్రోత్సహం మాత్రం ఇక్కడ లభించడం లేదంటూ ప్రస్తుత పరిస్థితిని ఆమె వివరించారు.