తెలుగు చలన చిత్రసీమలో ఓ శకం దాదాపు ముగిసింది. ప్రముఖ నిర్మాత కె. రాఘవ (105) నిన్న రాత్రి కన్నుమూశారు. సినిమా రంగానికి 'కష్టేఫలి' అనే మాట బాగా వర్తిస్తుందనడానికి రాఘవనే నిదర్శనం. బీదరికం కారణంగా చిన్న వయసులోనే ఇంట్లోంచి పారిపోయి కలకత్తాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు రాఘవ. ఆ తర్వాత ముంబైలో కొద్దికాలం ఫిల్మ్ ప్రోసెసింగ్ యూనిట్ లో వర్క్ చేశారు. విజయవాడ మారుతీ టాకీస్ లో కస్తూరి శివరావు దగ్గరా పనిచేశారు. చెన్నపట్నం చేరి కెమెరా ట్రాలీ బోయ్ గా, ఫైట్ మాస్టర్ గా, డూప్ గా... బతకడం కోసం రకరకాల పనులు చేస్తూ... చివరకు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. ఆ తర్వాత మిత్రుల సహకారంతో 'జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, జగత్ జెట్టీలు' సినిమాలు నిర్మించారు. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ లో 'తాతా మనవడు'తో దాసరిని, 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేశారు. వీరిద్దరూ శతాధిక చిత్రాల దర్శకులు కావడం గొప్ప విశేషం. తెలుగుతో పాటు తమిళంలో 'మైనర్ మా పిళ్ళై', హిందీలో 'ఇత్నీ సీ బాత్' సినిమాలను కె. రాఘవ నిర్మించారు. దాదాపు 30 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన కె. రాఘవ కు 2009లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందించింది. నిండు నూరేళ్ళ జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో గడిపిన ఆయన ఇప్పుడు సుదీర్ఘ నిద్రలోకి జారుకున్నారు.
నిర్మాత అనే పదానికి, బాధ్యతకి నిర్వచనం కె.రాఘవ !!
- డా౹౹ఎం.మోహన్ బాబు
ప్రఖ్యాత నిర్మాత కె.రాఘవ గారి హఠాన్మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన నిర్మాణంలో "తూర్పు పడమర" అనే చిత్రంలో నటించిన నాకు, రాఘవ గారితో విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనంలా వ్యవహరించే ఆయన నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శిరిడి సాయినాధుని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాను.