భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. కివీస్ గడ్డ మీద ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అదే సమయంలో భారత మహిళల జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. పురుషుల జట్టు ఆడే టీ20 మ్యాచ్‌లను వెల్లింగ్టన్, ఆక్లాండ్, హమిల్టన్‌లలో నిర్వహించనున్నారు. ఇండియా-ఏ జట్టు కూడా వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. న్యూజిలాండ్-ఏతో 3 నాలుగు రోజుల మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. నాలుగు రోజుల మ్యాచ్‌లను వరుసగా మౌంట్ మౌంగనుయి, సెడాన్ పార్క్, కోబం ఓవల్‌లో నిర్వహించనుండగా.. వన్డేలకు బే ఓవల్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత క్రికెట్ జట్ల పర్యటనతో వచ్చే న్యూజిలాండ్‌లో వచ్చే వేసవి మరింత హాట్‌గా ఉండనుంది. ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌తో న్యూజిలాండ్ హోం సీజన్ ప్రారంభం కానుంది. కివీస్, శ్రీలంక మధ్య డిసెంబర్ 26న తొలి టెస్ట్ జరగనుంది. లంక జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఒక టీ20 కూడా ఆడనుంది. భారత పర్యటన ముగిశాక బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ వెళ్తుంది. ఇరు జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నాయి.