YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేపటితో ముగియనున్న సర్పంచ్ ల కాలం

రేపటితో ముగియనున్న సర్పంచ్ ల కాలం
మరో రెండు రోజుల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో సర్పంచ్‌ల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తుందా? లేదా సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌ఛార్జీలుగా కొనసాగిస్తుందా? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. శుక్రవారం  తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్‌లను పర్సన్ ఇన్‌ఛార్జిలుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ముందర పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపకపోవడంతో పంచాయతీ పాలన కోసం పర్సన్ ఇన్‌ఛార్జిలను లేదా ప్రత్యేక అధికారులకు ఆ బాధ్యతలను కట్టబెట్టాల్సి ఉంది. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 143(3) ప్రకారం సర్పంచ్‌ల పదవీకాలం ముగిశాక, పంచాయతీ పాలనపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో అత్యధిక మంది సర్పంచ్‌లు టీడీపీ మద్దతుదారులే ఉండటంతో వారిని పర్సన్ ఇన్‌ఛార్జిలుగా కొనసాగిస్తే రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీకి మరింత మేలు కలుగుతుందన్న ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది. కాగా, పొరుగున ఉన్న తెలంగాణాలో మాత్రం సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతొంది. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పర్సన్ ఇన్‌ఛార్జిల పదవులను సర్పంచ్‌లకు కట్టబెట్టే ఆలోచనలో ఉండటంతో సర్పంచ్‌లు రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా తమదే హవా ఉంటుందని అంటున్నారు. మరోపక్క పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలా? లేదా వాయిదా వేయాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఎన్నికల సంఘం కూడా ముందడుగు వేయలేకపోతొంది. పంచాయతీ ఎన్నికలను నిర్ధేశించిన కాలంలో నిర్వహించలేని పక్షంలో అందుకు గల కారణాలను ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పంచాయతీలకుగాను ఏడువేలకు పైగా సర్పంచ్‌లు టీడీపీ మద్దతుదారులు ఉండటంతో సర్పంచ్‌లను కొనసాగించడమే మేలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక విజయనగరం జిల్లాలో పరిశీలిస్తే.. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలు ఉండగా వాటిలో 576 పైచిలుకు పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. సర్పంచ్‌లను పర్సన్ ఇన్‌ఛార్జిలుగా నియమించడం ద్వారా వైసీపీ మద్దతుదారులను కూడా తమవైపునకు ఆకట్టుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పర్సన్ ఇన్‌ఛార్జిల పాలనకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటి వరకు అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించకపోవడంతో సర్పంచ్‌లు ఊగిసలాడుతున్నారు.

Related Posts