YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో కమలానికి కలిసొస్తున్న కాలం

కర్ణాటకలో కమలానికి కలిసొస్తున్న కాలం
కర్ణాటకలో బీజేపీ ఏదీ చేయకుండానే దానికి లోక్ సభ ఎన్నికల్లో కలసి వచ్చేటట్లుందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు కమలం పార్టీకి అనుకూలంగా మారనున్నాయా…? ముఖ్యమంత్రి కుమరస్వామి వివాదాస్పద ప్రకటనలు, రైతు రుణమాఫీ, ప్రత్యేక ఉత్తర కర్ణాటక వివాదాలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రతికూలంగా మారనున్నాయా? అవుననే ధీమాగా ఉంది కమలదళం. గత శాసనసభ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను సాధించిన ఆ పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కొల్లగొట్టాలని కన్నేసింది. ఈ మేరకు ప్రణాళికను కూడా రూపొందించుకుంది. ఒకవైపు సెంటిమెంట్ ను గౌరవిస్తూ, మరోవైపు ఐక్యత నినాదాన్ని అందుకుంటూ ముందుకెళ్లాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ గత ఎన్నికల్లో వీరశైవ లింగాయత్ లను విభజించేందుకు, వారిని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఎన్నికల్లో మాత్రం లింగాయత్ లు తమవైపు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక ఉద్యమాన్ని జేడీఎస్ వెనకుండి నడిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. ఉత్తర కర్ణాటక ఉద్యమాన్ని రెచ్చగొట్టి పార్టీని బలోపేతం చేయాలన్నది దేవగౌడ ప్లాన్ గా యడ్యూరప్ప అభివర్ణించారు. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్రాన్ని విడగొట్టి రాజ్యమేలాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. అందుకే కుమారస్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.బీజేపీ కూడా ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంపై ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే ఆపార్టీ నేతలు శ్రీరాములుతో సహా ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఉద్యమంలో మమైకమయ్యారు. శ్రీరాములు ఉత్తర ఉద్యమాన్ని సాకుగాచూపి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే యడ్యూరప్ప మాత్రం శ్రీరాములు రాజీనామా చేయరనిచెబుతున్నారు. ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు యడ్యూరప్పఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కర్ణాటక అంతా కలసి ఉండేలా తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పటయ్యాక పాలన రాష్ట్రంలో లేకుండా పోయిందని, కుమారస్వామి వ్యక్తిగత లాభం చూసుకుంటూ ప్రజలను విస్మరిస్తున్నారన్న విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.లోక్ సభ ఎన్నికల తర్వాతే సంకీర్ణ ప్రభుత్వం విషయం చూడాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సభ్యులు బీజేపీ అగ్రనేతలతో టచ్ లోకి వచ్చినా వారు వారించారని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ సంకీర్ణ ప్రభుత్వం గురించి పట్టించుకోవద్దని కేంద్ర నాయకత్వం తెగేసి చెప్పడంతో రాష్ట్ర బీజేపీ నేతలు మిన్నకుండిపోయారు. రైతు రుణమాఫీ అమలుపై రాష్ట్రమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ తర్వాత కూడా కాంగ్రెస్ లో లుకలుకలు చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఇందుకోసం ఆగస్టు 9 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలోనే లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థులను గుర్తిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తర కర్ణాటక వివాదం తమకు కలసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. మొత్తంమీద లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలన్నలక్ష్యాన్ని కన్నడ బీజేపీ నేతలు చేరుతారో లేదో చూడాల్సి ఉంది.

Related Posts