తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకుని పవిత్రజలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవరాహ స్వామివారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా వైకుంఠం-1 కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. సామాన్య భక్తులతో పాటు క్యూలైన్ మార్గంలో శ్రీవారి ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అద్దాల మండపంలో ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఏఈవో శ్రీనివాసరాజు ఆయన స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఉపరాష్ట్రపతి వెంట ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఉన్నారు.
దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఉపరాష్ట్రపతికి ఆలయ మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ సామాన్య భక్తులతో పాటు ఆలయానికి చేరుకోవడం విశేషం.