‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టిన మాస్ మహారాజా రవితేజ.. తక్కువ గ్యాప్‌లోనే ‘టచ్ చేసి చూడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇదివరకు రవితేజ పోలీస్ పాత్రల్లో నటించిన వెంకీ, విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్ చిత్రాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఈ చిత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడిగా ఈ చిత్రం అతనికి మొదటి ప్రయత్నమే అయినా, గతంలో రవితేజ హీరోగా నటించిన ‘మిరపకాయ్’ సినిమాకి స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన అనుభవం వుంది. మరి ఆ అనుభవంతో రవితేజని ఈ సినిమాలో ఎలా చూపించారు? భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా రవితేజ గత పోలీస్ చిత్రాల మాదిరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? దర్శకుడిగా విక్రమ్ సిరికొండ మొదటి ప్రయత్నం ఫలించిందా?
కథాంశం
ఏసీపి కార్తికేయ (రవితేజ) ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ తప్ప మరేమీ పట్టదు. ఫ్యామిలీ ఎమోషన్స్ జీరో. అలాంటి కార్తికేయ కొన్ని పరిస్థితుల వల్ల తన శైలిని మార్చుకుని.. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ప్రారంభిస్తాడు. అంతేగాకుండా, ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు పుష్ప (రాశి ఖన్నా) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు అంగీకరిస్తాడు. పుష్ప కూడా ఈ పెళ్ళికి అంగీకరించినా.. కొన్ని కారణాల వల్ల కార్తికేయని అపార్థం చేసుకుంటుంది. అయితే కార్తికేయ మంచితనం తెలుసుకుని అతనికి దగ్గరవ్వాలనుకుంటుంది. మరోవైపు.. కార్తికేయ కంపెనీలో పనిచేసే ఓ పెద్దాయన కొడుకుని హత్య చేస్తాడు ఇర్ఫాన్ (ఫ్రెడ్డీ దారువాలా). ఆ హత్యని కార్తికేయ చెల్లెలు చూస్తుంది. సాక్షి వివరాలు బయటకు రాకుండా, తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఆ ముద్దాయిని పట్టుకునేందుకు పోలీస్ అధికారి (షాయాజీ షిండే) సహకారం తీసుకుంటాడు కార్తికేయ. అయితే, అతని చెల్లెలు ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారమని.. ఇప్పటికే పోలీస్ రికార్డుల్లో చనిపోయిన ఇర్ఫాన్.. ఈ హత్యను ఎలా చేస్తాడు? అంటూ పోలీస్ అధికారి ప్రశ్నిస్తున్నప్పుడే.. ఇర్ఫాన్‌ను చూస్తాడు కార్తికేయ. చెల్లెలు ఇచ్చిన ఆధారాల ప్రకారం వేయించిన స్కెచ్ చూడకుండానే.. ఇర్ఫాన్ వెంట పడతాడు. అసలు ఇర్ఫాన్ ఎవరు? కార్తికేయకి, ఇర్ఫాన్‌కు ఉన్న సంబంధమేమిటి? డ‌్యూటీ తప్ప మరేమి పట్టని కార్తికేయ.. తన ఫ్యామిలీకే ప్రాధానత్య ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? కార్తికేయ జీవితంలో దివ్య (సీరత్ కపూర్) పాత్ర ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే టచ్ చేసి చూడు చిత్రం
విశ్లేషణ
డ్యూటీ, ఫ్యామిలీ.. ఈ రెండింటిని బ్యాలెన్స్‌గా చూసుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయకుడి పాత్రలో మూడు కోణాల్ని స్పృశిస్తూ ఈ కథని డిజైన్ చేసుకున్నారు. ఓ కోణంలో డ్యూటీ తప్ప మరేమి పట్టని వ్యక్తిగా హీరోని చూపిస్తే.. మరో కోణంలో ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిగా చూపించారు. మూడో కోణంలో రెండింటిని బ్యాలెన్స్ చూసుకునే వ్యక్తిగా చూపించారు. ఇవన్నీ బాగానే కుదిరినా.. సినిమాలో హడావుడి ఎక్కువైపోవడం వల్ల కథనం మందగించింది. చెల్లెలు చేత సాక్ష్యం చెప్పించే సన్నివేశం, ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి హీరో తండ్రి జయప్రకాష్ చెప్పే సన్నివేశం, అలాగే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్, ముఖ్యమంత్రి ర్యాలీకి సంబంధించిన సన్నివేశం.. ఇలా కొన్ని సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అలాగే రాశి ఖన్నా, సుదర్శన్ మధ్య సాగే సరదా సన్నివేశాలు నవ్వు పుట్టిస్తాయి. అయితే ఓవరాల్‌గా ఆడియన్స్‌ను కట్టిపడేసే కథనం లేకపోవడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. అలాగే సుహాసిని, సీరత్ కపూర్ పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం కూడా మైనస్‌గానే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. మూడు ఛాయలున్న పాత్రలో రవితేజ నటన మెప్పిస్తుంది. అయితే, వీటిలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న ఎపిసోడ్స్‌లో తన నటన గుర్తుండిపోతుంది. రాశీ ఖన్నా పాత్ర పరిధి ప్రథమార్థానికే పరిమితమైనా.. సరదా సన్నివేశాల్లో రాణించింది. పాటల్లో గ్లామర్‌తో ఆకట్టుకుంది. సీరత్ కపూర్ మరోసారి స్కిన్ షోకే పరిమితమైంది. విలన్‌గా ఫ్రెడ్డీ దారువాలా పాత్రలో విలనిజానికి స్కోప్ తక్కువ. నటన కూడా ఆకట్టుకోలేదు. మిగిలిన నటులంతా తమ పరిధి మేర ఓకే అనిపించుకున్నారు.
సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. జామ్ 8 కంపెనీ అందించిన పాటల్లో ఓయే పుష్పా, మనసా పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. మణి శర్మ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, మరి కొన్ని సన్నివేశాలకి అవసరానికి మించి ఉన్నట్లుగా అనిపిస్తుంది. బాధ్యతను మరిచిపోయి పనిచేస్తే జాబ్ మాత్రమే పోతుంది. బంధాల్ని మరచిపోతే.. జీవితం పోతుంది, ఫ్యామిలీ అంటే ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ వంటి డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చిత్రం: టచ్ చేసి చూడు.,తారాగణం: రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారువాలా, సుహాసిని, మురళీ శర్మ, సత్యం రాజేష్, జయ ప్రకాశ్, వెన్నెల కిషోర్ తదితరులు.,ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు.,కూర్పు: గౌతమ్ రాజు.,సంగీతం: జామ్8
నేపథ్య సంగీతంః మణిశర్మ.,నిర్మాత: నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ మోహన్.,కథ: వక్కంతం వంశీ.,స్క్రీన్‌ప్లేః దినకర్ రాజ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ.
నటీనటులు రవితేజ,రాశి ఖన్నా గ్లామర్ ,ఛాయాగ్రహణం,నిర్మాణ విలువలు ప్లస్ పాయింట్స్ నటీనటులు అయితే.. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ , పవర్ ఫుల్ విలన్ లేకపోవడమే మరి.