YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే

 గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే
భారీగా ఒంటిపై బంగారం ధరించి కన్వర్ యాత్రలో పాల్గొనే గోల్డెన్ బాబా మళ్లీ వార్తాల్లో నిలిచారు. గోల్డెన్ బాబాగా పిలిచే ఆయన అసలు పేరు సుధీర్ మక్కర్. 25 వ సారి కన్వర్ యాత్రలో పాల్గొంటున్న బాబా, గతంలో కంటే ఈ సారి మరింత ఎక్కువ బంగారం ధరించడం విశేషం. ఏకంగా 20 కిలోల బంగారు ఆభరణాలు ధరించి యాత్రలో పాల్గొంటున్నారు. దీని విలువ రూ.6 కోట్లు పైచిలుకే ఉంటుంది. రెండేళ్ల కిందట 2016లో 12 కిలోలు, గతేడాది 14.5 కిలోల బంగారంతో యాత్రలో పాల్గొన్నారు. ఏటా శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేపట్టే యాత్రను కన్వర్‌ యాత్రగా పిలుస్తారు. గతేడాది గోల్డెన్ బాబా ధరించిన ఆభరణాల్లో 21 గొలుసులు, దేవుడి విగ్రహాలతో కూడిన 21 లాకెట్లు, చేతి కడియాలు, బంగారపు జాకెట్‌, తదితరాలు ఉన్నాయి. ఈ బంగారం ఆభరణాలన్నీ ధరించి ఎస్‌యూవీ పైన కూర్చుని వెళ్తారు. 
పెద్ద ఎత్తున బంగారం ధరించడం వల్ల 56 ఏళ్ల గోల్డెన్‌ బాబా ఈ యాత్రలో ప్రత్యేకంగా మారారు. దీనిపై గతంలో బాబా మాట్లాడుతూ... ప్రస్తుతం తన మెడలో శివుడి లాకెట్‌తో కూడిన రెండు కిలోల బరువుండే చైన్ ఉన్నట్టు తెలిపారు. ‘యాత్రలో ఇంత పెద్ద మొత్తం బంగారు ఆభరణాలు ధరించడం వల్ల మెడ నరాలు, కంటిచూపుపై ప్రభావం చూపుతోంది.. అయితే ఇది నా రెండో చివరి కన్వర్ యాత్ర, 2018తో రజతోత్సవం పూర్తవుతుందని అప్పట్లో అన్నారు. నేను ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారాను.. ఎక్కడికి వెళ్లినా నన్ను చూడడానికి జనం వస్తున్నారు. పోలీసులు నాకు భద్రత కల్పించాలి’ అని బాబా కోరారు. ‘గతంలో తన వద్ద కొన్ని గ్రాముల బంగారం మాత్రమే ఉండేది.. ఇప్పుడు కిలోల కొద్దీ బంగారం ధరిస్తున్నానంటే అదంతా శివుడి దయేనని పేర్కోవడం’ విశేషం. కేవలం బంగారం మాత్రమే కాదు రూ.27 లక్షలు ఖరీదైన రోలెక్స్ చేతిగడియారం ధరించి, తన బీఎండబ్ల్యూ, మూడు ఫార్చ్చూన్స్, రెండు ఆడి, రెండు ఇన్నోవాలతో ఊరేగింపుగా వెళ్తారు. అలాగే హమ్మర్, జాగ్వార్, లేండ్ రోవర్ లాంటి కార్లను కూడా యాత్ర కోసం అద్దెకు తీసుకుంటారు. బంగారం, కార్లను తాను ఎంతగానో ప్రేమిస్తాను, 1972-73లో తులం బంగారం రూ.200 ఉండేది, ఆ సమయంలో నాలుగు తులాల బంగారం ధరించాను. క్రమంగా ఇది పెరుగుతూ వచ్చింది.. నేను మరణించేదాకా బంగారం నా వద్దే ఉంటుంది.. ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లిపోయేటప్పుడు నా ప్రియ భక్తుడికి దానిని అప్పగిస్తాను’అని బాబా అన్నారు. సుధీర్‌ మక్కర్‌ బాబాగా మారడానికి ముందు దిల్లీలో వ్యాపారవేత్త. గాంధీనగర్‌ మార్కెట్‌లో వస్త్రాలు, స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. ఘజియాబాద్లోని ఇందిరాపురంలోనూ విలాసవంతమైన భవంతి ఉండేది. ఆరేళ్ల వయసులో గురుకులంలో చేరిన సుధీర్ మక్కర్ జీవనోపాధిని వెతుక్కుంటూ హరిద్వార్ చేరాడు. అక్కడ ఫుట్‌పాత్‌లపై పూసలు, వస్త్రాలు అమ్ముతూ అంచెలంచెలుగా వ్యాపారవేత్తగా మారాడు. ఢిల్లీలో బిట్టు లైట్‌ బాజ్‌ బ్రాండ్ పేరుతో జీన్స్, షర్ట్స్, జాకెట్స్ అమ్మి ఫేమస్ అయ్యాడు. అయితే, ఆయన క్రిమినల్‌ రికార్డ్‌ కారణంగా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బాబాగా మారారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ యాత్ర కోసం అదనంగా 4 కిలోల బంగారం కొన్నట్లు బాబా తెలిపారు. ఆయన గంగా జలంతో నింపే కుండ కూడా బంగారం పూత పూసి ఉంటుంది. ఈ ఏడాది యాత్ర కోసం రూ.1.25 కోట్లు ఖర్చుచేస్తున్నారు. తనతో పాటు యాత్రకు వచ్చే 250 నుంచి 300 మంది యాత్రికులకు ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. బాబా ఊరేగింపు కోసం యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎదురుచూసి వీడియోలు తీసుకుంటారు. 

Related Posts