YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికల బరిలో కమల్, రజనీ

 ఎన్నికల బరిలో కమల్, రజనీ

విలక్షణ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు మంచి స్నేహితులు. వారిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ అప్పట్లో బ్లాక్‌బ్లాస్టర్లే. వీరి జోడీకి బాలీవుడ్‌ కూడా ఫిదా అయ్యింది. కాలక్రమేనా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు తగ్గిపోయాయి. అయితే, విభిన్న చిత్రాలతో తమిళ సినీ రంగంలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. వీరిద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ కంటే ముందుగానే కమల్ రాజకీయ పార్టీని స్థాపించి, రానున్న ఎన్నికలకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్.. 2021లో జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల కల్లా రజనీ సిద్ధమవుతారా లేదా అనే అనుమానాలు నెలకున్నాయి. ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య కారణాల వల్ల ఆయా పార్టీలు క్రమేనా ప్రభావం కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి చూపు రజనీకాంత్ పార్టీపైనే ఉంది. ఆయన కంటే ముందే పార్టీ పెట్టిన కమల్ కూడా చురుగ్గానే పావులు కదుపుతున్నాడు. అయితే, రజనీపై ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా, కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదనే చెబుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ హిందీ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ... ‘‘కలిసి పనిచేయడానికి మా ఇద్దరికీ అభ్యంతరం లేదు. దీనిపై మేం చర్చిస్తాం’’ అని అన్నారు. అయితే, కలిసి పనిచేసే విషయంలో ఓ లాజిక్ కూడా ఆయన చెప్పారు. ‘‘ఒకప్పుడు రజనీ, నేను కలిసి సినిమాలు చేశాం. ఆ తర్వాత చాలా సినిమాలు వదులుకున్నాం. ఇందుకు మేం తీసుకున్న నిర్ణయమే కారణం’’ అని అన్నారు. ‘‘మా ఇద్దరిని పెట్టి సినిమా అంటే భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఇక మాతో సినిమాలు తీసేవారు ఎవరుంటారు? ఇదే పరిస్థితి రాజకీయాల్లోనూ ఉండొచ్చేమో? మాకైతే తెలీదు’’ అని అన్నారు.1970 దశకంలో కమల్, రజనీకాంత్‌లు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని సినిమాల్లో రజనీ విలన్ పాత్రలతో మెప్పించారు. క్రమేనా వీరి రెమ్యునరేషన్ పెరగడంతో ఇద్దరితో కలిసి సినిమా తీయడానికి నిర్మాతలు ఆలోచించేవారు. ఈ నేపథ్యంలో రజనీ, కమల్ పలు సినిమాలను వదులుకున్నట్లు తెలిసింది. అయితే, ఎవరి స్టైల్లో వారు తమిళ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో సైతం తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. చివరిగా వీరిద్దరూ 1985లో ‘గిరఫ్తార్’ అనే హిందీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా నటించారు. 

Related Posts