ఒకవైపు కాపుల రిజర్వేషన్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. రిజర్వేషన్ల అంశంలో తను తప్పుడు హామీని ఇవ్వలేను అని, చంద్రబాబులా మోసం చేయలేనని అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అనడం, ఆపై ఈ ప్రకటనపై కొంతమంది కాపు సామాజికవర్గం ప్రముఖులు, అధికార టీడీపీ విరుచుకుపడటం తెలిసిన సంగతే. అలాగే జగన్ చేసిన ఆ ప్రకటనకు నిరసనగా ఆయన పాదయాత్ర సమయంలో కొంతమంది కాపులు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అదంతా ఒక ఎత్తు అయితే.. పాదయాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో నడుస్తున్న జగన్‌కు ఆసక్తిదాయకమైన ఫ్లకార్డులు ఎదురయ్యాయి. జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన జరిగింది. కాపు యువత పేరుతో ఈ ఫ్లకార్డుల ప్రదర్శన జరిగింది. ‘కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండువేల కోట్ల రూపాయల చొప్పున పదివేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇస్తానన్న జగన్ గారికి అభినందనలు..’ అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు కొంతమంది. కాపు యువత తరఫు నుంచి ఆ ఫ్లకార్డుల ప్రదర్శన జరిగినట్టుగా తెలుస్తోంది. మరికొందరు కూడా ఈ విషయంలో ‘జగన్ గారికి థ్యాంక్స్’ అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు.