రాజకీయాల్లో నాయకులు.. తమ నియోజకవర్గాలనే కాదు.. పక్క నియోజకవర్గాలను సైతం ప్రభావితం చేయగల రేంజ్‌కు ఎదిగిపోయారు. ఇక, దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబాల పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంది. ఈ కుటుంబాలు ఒకటి కాదు ఏకంగా రెండు మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయి. కర్నూలుకు చెందిన దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబం ఇప్పటికీ.. ఇక్కడ హవా చలాయిస్తోంది. ప్రజల్లో మంచి పట్టున్న ఈ కుటుంబం ఎన్నికల సమయంలో ఓట్లనుచీల్చడం ద్వారా తమ హవాను కాపాడుకుంటోంది. గత ఎన్నికల్లో ఇదే జరిగింది. కాంగ్రెస్‌లో కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించిన కోట్ట ఫ్యామిలీ.. కర్నూలు ప్రజలతో మమేకమైపోయింది. కర్నూలులోని పలు నియోజకవర్గాల్లో కోట్ల ఫ్యామిలీ మాటలకు ఇప్పటికీ వాల్యూ ఉంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ పూర్తిగా కుదేలైపోయినా.. ఈయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అంతేకాదు, తన నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను తీవ్రంగా ప్రభావితం చేశారు.
గత ఎన్నికల్లో.. కర్నూలు ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన కోట్ల ఓటమిపాలైనా.. దాదాపు లక్షకు పైగా ఓట్లు సాధించి.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఊడ్చుకుపోయినా.. తన హవా మాత్రం ఇంకా ఉంది నిరూపించుకున్నారు. అంతేకాదు.. చుట్టుపక్కల నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపించారు. ఓట్లు చీలిపోవడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసిన కోట్ల భార్య సుజాతమ్మకు 25 వేల ఓట్లు రావడం రికార్డే. అలాగే పత్తికొండలోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన
కె.లక్ష్మీనారాయణరెడ్డి ఏకంగా 31 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ ప్రభావం జిల్లాలో కోట్ల ఫ్యామిలీకి ఉన్న పట్టును తెలియజేస్తోంది. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కోట్ల ప్రభావం భారీగా ఉంటుంది. ఇప్పటకీ ఒక్కొక్క నియోజకవర్గంలోనూ కనీసం 8 నుంచి 9 వేల చొప్పున ఓట్లను కోట్ల తన కనుసన్నల్లో పెట్టుకున్నారు. ఆయా కుటుంబాల వారు కోట్ల చెప్పిన వారికే ఓటు వేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేసే నాయకులు కోట్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతుంటారు. ఆయన ఆశీర్వాదం ఉంటే.. ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై కోట్ల అభ్యర్థిగా చెరుకులపాడు నారాయణ స్వామిని నిలబెట్టారు అయితే, ఈయన ఓడిపోయినా.. కేఈకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. ఆయనకు పడతాయని భావించిన వేల ఓట్లు.. చెరుకులపాడుకు పడ్డాయి. ఇదీ జిల్లాలో కోట్ల రాజకీయ గ్రిప్ ను సూచిస్తోంది. ఇక, వచ్చే ఎన్నికల వేళ ఆయన పార్టీ మారతారని వార్తలు వచ్చినా కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతానని చెప్పేశారు. మళ్లీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉండి ఆయన ఎంపీగా బరిలో ఉండి… ఆయన అనుచరులను జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేయిస్తే జిల్లాలో రెండు ప్రధాన పార్టీలపై కోట్ల ప్రభావం మరింతగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీలకు ఈ పరిణామాలతో ఇబ్బందులేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.