నగరంలోని మల్కాజ్‌గిరిలో దారుణం చోటుచేసుకుంది. జ్యోతి హై స్కూల్ చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని దీప్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి ఇంటికొచ్చిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ ధనదాహం మరో విద్యార్ధినిని బలి తీసుకుంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.దీప్తి తల్లిదండ్రులు శక్తికి మించి ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నారు. అయితే ఈసారి స్కూల్ ఫీజు కట్టడంలో కాస్త ఆలస్యమైందనీ దీంతో స్కూల్ యాజమాన్యం దీప్తిని పరీక్ష రాయనివ్వలేదు. దీప్తి ఎంత ప్రాధేయపడ్డా స్కూల్ యాజమాన్యం కనీసం కనికరం చూపించలేదు. పైగా తోటి విద్యార్థులందరి ముందు అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుంది. ‘నన్ను పరీక్ష రాయనివ్వలేదు సారీ మామ్’ అని దీప్తి రాసిన లేఖను తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమ కూతురు చావుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, ప్రభుత్వాన్ని మృతురాలి తల్లిదండ్రులు విన్నవించుకున్నారు.
అమ్మాయి ఫీజు ఇప్పుడు కట్టే పరిస్థితుల్లో లేననీ.. ఫిబ్రవరి 10న కడతామని స్కూల్ యాజమాన్యానికి రెండు రోజుల కిందటే చెప్పానని దీప్తి తండ్రి మీడియాకు వివరించాడు. అయితే ఇంతలో మళ్లీ మా బిడ్డను ఇబ్బంది పెట్టారని దీప్తి తండ్రి మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మాయి ఇంటర్, పదో తరగతి కాదు కదా అయినా స్కూల్ యాజమాన్యం ఎందుకిలా ప్రవర్తిస్తుందో తమకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వచ్చిన అమ్మాయి మాతో రెండు గంటలపాటు ఉండి మేం ఇంటి నుంచి బయటికెళ్లి వచ్చేసరికి ఇలా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని దీప్తి తల్లి కంటపతడిపెట్టారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని కోరారు.