YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                           బాల కాండ మందర మకరందం

                                     ఎందుకు చదవాలి? ఏం తెలుసుకోవచ్చు?

 

శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.
వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది,. శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, భవిష్యత్ తరాలవారు అంధకారంలో పడిపోయి దురాచార పరులై పోయేవారేమో! అట్టి మహోపకారం లోకానికి చేసిన వాల్మీకి మహర్షిని ఎంత పొగిడినా తక్కువే.
    శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అనిబోధపడుతుంది.జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.
    రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే యోగ్యతలున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు.
    "తపమున స్వాధ్యాయంబున. ... .. " అనే పద్యంతో ఆరంభం చేసి, రామాయణాన్నంతా, నారదుడి మాటల్లోఉపోద్ఘాతంలా పాఠకులకు సంక్షిప్తంగా, ముందుగానే వివరించడం జరిగింది బాల కాండ మందర మకరందంలో. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవంకలిగించేందుకు, ఈ ఉపోద్ఘాతంలో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం జరిగింది. దాన్నే మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.
బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతనిఅర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.
వాల్మీకి అడిగినప్రశ్నలు పదహారు. ఇది తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు  పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి విషయమై  తన అభిప్రాయాన్ని దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు ప్రశ్నలడిగాడు వాల్మీకి.
బాల్యంలోనే శ్రీరాముడు గుహుడిలాంటి (నీచ) జాతివారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం-జనకాజ్ఞ జవదాటక పోవడం-పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ - భయంకరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది.
తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. రామగుణస్మరణమనే అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగును కదా! అయోధ్య సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుంది కదా? శ్రీరాముడిని గురించి వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని, వాదం కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు.
అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలు రాముడికి వున్నాయని నారదుడు వాల్మీకికి చెప్పడంలో చాలా అర్థముంది. కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన.కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని శ్రీరామచంద్రుడు పేరు తెచ్చుకున్నాడని నారదుడంటాడు.రాముడు తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు చెపుతున్నాడే అనిగానీ భావించరాదు.
దశరథుడు నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని కనింది. భర్త చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల జీవించి, శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే. పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే. బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. "కౌసల్యా సుప్రజ రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగ రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద వర్థనుడు" అని నారదుడు, "కౌసల్యా సుప్రజ రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడికంటే కౌసల్యే ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం.
వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో, నారదుడిచ్చిన సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే అన్వయించి చెప్పి, రామాయణాన్ని పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా వుండొచ్చునని అనవచ్చు. శ్రీమద్రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదమంటే మేఘమని అర్థం. మేఘం నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞాన దాత. జ్ఞాన దాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే దాన్ని "నారద పాంచరాత్రం" అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే.నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణంలో, రాముడిని అడవులకు పంపినందువల్ల దశరథుడు మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదని వుంది.సూర్య వంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా భరతుడు తిరస్కరించడం సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు. అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేసాడు. దాన్ని మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని కలగడమే. ఇది ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ హాని కూర్చలేడు. అయినా వశిష్ఠుడు  ప్రార్థించాడే గాని శాసించలేదు.
బాల కాండలోని సంక్షిప్త రామాయణంలో  నారదుడు అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియ పరుస్తాడు.
సీతను రక్షించ బోయి రావణుడి వల్ల చనిపోయిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి రాముడు శోకించాడని సంక్షిప్త రామాయణంలో నారదుడు చెప్పాడు.రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు.   మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది. అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?
రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తన కొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు.
పంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడని చెప్పబడింది. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతివాడైనా, పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే, భక్తికి అందరూ అధికారులేనన్న విషయం. అట్టి అధికారం నీచ జాతులని చెప్పబడేవారిలోనే విశేషంగా కనిపిస్తుంది. జ్ఞానంతో రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారు కొందరే. భక్తితో ఆశ్రయించేవారు కోటానుకోట్లు. ఫలితం ఇరువురికీ సమానమే.
ఒకే ఒక్క బాణంతో రాముడు వాలిని నేలగూల్చుతాడు అని చెప్పడంలో చాలా అర్థముంది. తమ్ముడి భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్ర బద్ధుడైన రాముడు అట్లే చేశాడు. నేలబడేటట్లు కొట్టాడే కాని, ప్రాణంపోయేటట్లు కొట్టలేదు. ఎందుకంటే వాడి దోషం గురించి వాడికి చెప్పి ఇది ప్రాయశ్చిత్తం అని తెలియచేసేందుకే. దీన్ని బట్టి రాముడి ధర్మ బుద్ధి, సత్య పరాక్రమం స్పష్టమవుతుంది.
సంక్షిప్త రామాయణం సుందర కాండలో హనుమంతుడికి, ఇంద్రజిత్తుకు మధ్య జరిగిన యుద్ధం, అందులో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ఆయన చేతిలో హనుమంతుడి ఓటమి గురించి చెప్పబడింది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని పడగొట్టాడు. అస్త్ర బంధనం అభేద్యమని తెలియని మూఢులు- అతడి అనుచరులు, వూరికే కిందపడ్డాడని అనుకున్నారు. తటాలున పైనబడి హనుమంతుడిని తాళ్లతో కట్టేసారు. నీచ సాంగత్యాన్ని, తనపైన విశ్వాసం లేకపోవడాన్ని ఓర్చుకోలేని బ్రహ్మాస్త్రం హనుమంతుడి కట్లు వదిలించింది. అది రాక్షసులకు తెలవదు. హనుమంతుడికి తెలిసినా రావణుడిని చూసి మాట్లాడాలని, కట్లున్నవాడిలాగానే నటించాడు. ప్రపత్తికి మహా విశ్వాసమే ప్రాణం. విశ్వాస లోపం జరుగుతే ప్రపత్తి చెడుతుంది. బ్రహ్మాస్త్రం బంధాలకన్న తాళ్లు గట్టివనుకున్నారు మూఢ రాక్షసులు. అట్లాగే భగవంతుడికి శరణాగతులైనవారు, ఆయనమీద నమ్మకం లేక, ఇతర ఉపాయాలను వెదికితే భ్రష్టులవుతారు.
రావణ సంహారం జరిగిన తర్వాత, విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసి, వీరుడై, కృతకృత్యుడై, మనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు అని చెప్పబడింది. అంటే, రావణ వధ, సీతా ప్రాప్తి, ప్రధానం కాదని, విభీషణ పట్టాభిషేకమే ప్రధానమని సూచించబడిందిక్కడ. ప్రధాన ఫలం ప్రాప్తించినప్పుడే ఎవరైనా కృతకృత్యుడయ్యేది - మనో దుఃఖం లేనివాడయ్యేది. సీతా ప్రాప్తి స్వకార్యం. దొంగలెత్తుకొని పోయిన తన సొమ్ము తాను తిరిగి రాబట్టుకోవడంలాంటిది. చోరదండనమే రావణ వధ. తనపని తాను చేయడంలో గొప్పేముంది? విభీషణ పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ అశ్రిత రక్షాభిలాషే రావణ వధకు ముఖ్య కారణం. సీతా ప్రాప్తి స్వంత కార్యం. అందుకే సీతను నిరాకరించగలిగాడుగాని, విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ వహించాడు శ్రీరాముడు.
రామాయణ రచనకు వాల్మీకిని బ్రహ్మ నియమించి వెళ్లిన తర్వాత, యోగదృష్టితో రామాయణాన్నంతా వాల్మీకి చూసినదాన్ని వివరించడంవల్ల రామాయణం మొత్తం చదివే అవకాశం బాల కాండలో కలుగుతుంది.
బాలకాండలో రామాయణం మొత్తం సంక్షిప్త  రామాయణంగా నారదుడు వాల్మీకికి బోధించాడు. దీనిని బాల రామాయణం అని కూడా అంటారు. బాలకాండలో ఈ భాగం చదివితే, రామాయణమంతా సంక్షిప్తంగా తెలుసుకున్నట్లే. ఇదే సంస్కృతంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథమని పేరు.
ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో "త్" శబ్దం కడపట రాకూడదు-దానికి ముందున్న "య" కారాన్నిగ్రహించాలి.
నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల (శ్లోకం) పద్యమయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు.సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు.
గ్రంథాన్ని చదవాలనుకునేవారు మూడు విషయాలు అవశ్యంగా తెలుసుకోవాలి. గ్రంథం చెప్పిందెవరు? అతడి నడవడి ఎలాంటిది? లోకులకతడు ఆప్తుడా? అని విచారించాలి. దీన్నే వక్తృ విశేషం అంటారు. మేలుకోరి మంచే చెప్తాడన్న విశ్వాసానికి పాత్రుడైన వాడే ఆప్తుడు. వీడి వాక్యమే ఆప్త వాక్యం. ఆప్త వాక్యం తోసివేయలేనటువంటిది. మొదటి ఆప్తుడు భగవంతుడు. వేదం ఆప్తవాక్యం. ఫ్రజల మేలుకోరి, వేదార్థాలను, పురాణ-ఇతిహాస శాస్త్రాలను, లోకానికి తెలిపినవారు ఆప్తులు. వారి రచనలు ఆప్త వాక్యాలు. యధార్థాన్ని తను తెలుసుకుని, కామ-క్రోధ-లోభాలకు లోనుకాకుండా, తనెరిగిన ఆ యధార్థ విషయాన్నే, ఇతరుల మేలుకోరి చెప్పడమే ఆప్త లక్షణం. అలాంటిదే వాల్మీకికి బ్రహ్మానుగ్రహంవల్ల కలిగింది. కాబట్టి ఆయన పరమాప్తుడు.
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలో, ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది.
వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా"  అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.
పద్య రూపంలో శాపం ఇవ్వాలన్న తలంపు వాల్మీకికి లేదు. ఆయనా, తను వూరికే దూషించిన వాక్యం శాపంగా మారిందేనని, వాల్మీకి ఆశ్చర్యపడ్డాడు. దీని యదార్థ భావాన్ని వివిధ రకాలుగా విశ్లేషించవచ్చు. వాల్మీకి నారదుడిద్వారా రామ కథనంతా-సర్వం తెలుసుకుంటాడు. కరుణ రస భరితంగా ఆ చరిత్రను గ్రంథస్థం చేయాలనుకుంటాడు. అందుకు ఆయనకి కరుణ రసం తగినంత పాళ్లలో వుండాలికదా! ఆ విషయాన్ని పరీక్షించగోరి, గతంలో భృగుమహర్షి ఇచ్చిన శాపాన్ని స్థిర పరిచేందుకు, శ్రీరాముడు బోయవాడి వేషంలో రాక్షసుడైన క్రౌంచపక్షిని చంపాడట. దీనినే శ్రీరాముడు-సీత అనే భార్యా-భర్తల ఎడబాటుగా అన్వయించుకోవచ్చు కూడా. ఏదేమైనా, వాల్మీకి రామాయణంలో చెప్పిన దానికి అర్థం వెతికేటప్పుడు, వాల్మీకి రామాయణమే ప్రమాణం కాని, ఇతర గ్రంథాలు ప్రమాణం కావు.
అలాంటప్పుడు, వాల్మీకి రామాయణం సత్యచరిత్రమనీ, అందులోని అనేక విషయాలు జరిగినవి-జరిగినట్లే, తెలుపబడ్డాయనీ చదువరులు మనస్సులో వుంచుకోవాలి. తక్కిన రామాయణాలన్నీ స్వమతాభిమానాన్ని, స్వమతాన్ని వుద్ధరించాలన్న ఆలోచనను తెలియబర్చేవి మాత్రమే. తన ఏడుపు కథను రాసేందుకు వాల్మీకికి తగినంత మోతాదులో ఏడుపు గొట్టుందానని శ్రీరాముడు పరీక్షించాడనడం విడ్డూరమనే అనాలి. ఇంతకూ, వాల్మీకి రామాయణాన్ని శృంగార ప్రబంధంగా వ్యాఖ్యాతలందరు అంగీకరించారు కాని, కరుణ ప్రబంధంగా అంగీకరించలేదు. సీతా వియోగం కూడా విప్రలంభ శృంగారమే.
వాల్మీకి బోయవాడిని రామచంద్రమూర్తి అని అనుకుని శపించలేదనేది పూర్తి యదార్థం. ఆయన రాముడి భార్య సీత తన ఆశ్రమంలో వుందన్న విషయం, ఆమె దుఃఖంతో పరితపిస్తున్న విషయం ఎరిగిన వాల్మీకి, ఆమె దుఃఖాన్ని మరింత పెంచడు కదా! తను పద్యరూపంలో అన్నది శాపంగా పరిణమిస్తుందని ఆయనకూ తెలియదప్పుడు. ఆయన మనస్సు లోని ఉద్దేశం తిట్టు రూపంలో పద్యంగా రావడానికి కారణం, ఆయన నాలుకపై సరస్వతి వుండడమే. పలికించింది బ్రహ్మ పనుపున రామకథ వాల్మీకితో చెప్పించాలని వచ్చిన సరస్వతి. అంటే, కవి అనుకోకున్నప్పటికీ, సరస్వతి ఆయన నోట అలా పలికించిందనాలి.
శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే . అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన బాల కాండ మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా కాండ మొదటి పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.
గ్రంథాలు మూడు రకాలు. ప్రభు సమ్మిత శబ్ద ప్రధానమైంది మొదటి రకం - అంటే, శబ్దాల ఆడంబరంతో రాజులాగా ఆజ్ఞాపించేది. ఇక రెండో రకం సుహృత్సమ్మిత అర్థ ప్రధానమైంది - అంటే, స్నేహితుడివలె బోధించేది. కాంతా సమ్మిత వ్యంగ్య ప్రధానమైంది మూడో రకం - అంటే, వ్యంగార్థమే ప్రధానంగా వుండి, ప్రియురాలివలె మనస్సుకు నచ్చచెప్పి చేయించేది. రామాయణం అర్థ ప్రధానమై ఇతిహాసంగాను - వ్యంగ్య ప్రధానమై కావ్యంగాను ప్రసిద్ధి పొందింది. రామాయణాన్ని సీతా మహా చరిత్ర అంటాడు వాల్మీకి. రామచంద్రమూర్తి చరిత్రకంటే, సీతాదేవి చరిత్ర ఉత్కృష్టమైందని దానర్థం. కౌసల్యా గర్భ సంభూతుడు రాముడు. అయోనిజ సీత. తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవులకు వెళ్లినవాడు రాముడు. ఎవరి బలవంతం లేకపోయినా, కేవలం పతిభక్తితో అడవులకు పోయింది సీత. కష్ట కార్యాలు చేసినందువల్ల గట్టి దేహం కలవాడు రాముడైతే, ఎండకన్నెరుగని సుకుమారి సీత. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖ పడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందువల్లనే రామాయణాన్ని సీతా మహాచరిత్రమంటాడు వాల్మీకి మహర్షి.
తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు రామాయణ గానం చేస్తున్నారని తమ్ముళ్లతో అంటాడు శ్రీరామచంద్రుడు వారు తన ముందర గానం చేస్తున్నప్పుడు. రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై, కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా వస్తుంటాయో, అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం.
బాల కాండతో రామాయణ కథ ప్రారంభమవుతుంది. అయోధ్యా పుర వర్ణనతో మొదలవుతుంది.భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు.
అయోధ్యా పుర జనులను గురించి రాస్తూ, అక్కడి బ్రాహ్మణులను గురించి చెప్పబడింది. వారు ఆరంగాలవేదాధ్యయనం (శిక్ష – వ్యాకరణం – ఛందస్సు – నిరుక్తం – జ్యోతిష్యం - కల్పం) చేసినవారు. బ్రాహ్మణులను ద్విజాతులని - వేదషడంగ పారగోత్తములని–అహితాగ్నులని–సహస్రదులని–మహామతులని – సత్యవచస్కులని - హిమకరమిత్ర తేజులని – ఋషులని-హృష్ఠ మానసులని - శాస్త్ర చింతన పరాయణులని – స్వస్వతుష్టులని – త్యాగశీలురని - భూరి సంచయులని పోలుస్తూ వర్ణించబడింది.
అదేవిధంగా పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం అయోధ్య నగర వాసుల గురించి వర్ణించినప్పుడు చెప్పబడింది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేనని స్పష్ఠంగాచెప్పబడింది.
సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా, కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని బాధపడిన దశరథుడి విషయాన్ని ప్రస్తావిస్తూ, బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం, బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడనీ, సుతులు లేనివారికి గతులులేవంటాయని, కొడుకులవల్ల జయం-మనుమల వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయని, ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనేననీ, ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుందనీ, అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారని చెప్పబడిందిందులో.
దశరథుడి పుత్రకామేష్టి యాగానికి వచ్చిన విష్ణుమూర్తి, శరణాగతులైన బ్రహ్మాది దేవతలందరికీఅభయహస్తమిచ్చి, తాను మనుష్యుడిగా ఎవరికి జన్మించాలనీ-ఆ యోగ్యత ఎవరికున్నదనీ ఆలోచించాడు. తామరాకులలాంటి విశాలమైన నేత్రములున్న వాడు, పాప సంహారుడు, నమస్కారం చేసే ప్రజలను రక్షించాలన్న ఆసక్తిగలవాడు, వంచన లేనివాడైన భగవంతుడు తనకు తండ్రి కాగల అర్హుడు అయోధ్యాపురాధిపతైన దశరథుడేనని తలచాడు. దీనికి కారణముంది. స్వాయంభువ మనువు, పూర్వంగోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు "శ్రీకృష్ణుడు" గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి "కల్కి" గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి. భారతంలో హరివ్రతుడికి విష్ణుశర్మ అన్న పేరుంది.
దేవతల ప్రార్థన ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా వుండాల్నా-మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. అది వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం, వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. ఇదే లక్ష్మణ-భరత-విభీషణుల రక్షా విషయంలో కనిపిస్తుంది. లోకులందరూ ఈవిషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు సర్వాంతర్యామి-సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతల ఇష్టానుసారం చేయడమంటే, ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోందిక్కడ. అదేవిధంగా, తమనొక పెద్దను చేసి, అడిగినపుడు, తగిన రీతి తమకు తోచినది తప్పో-ఒప్పో చెప్పకపోతే, ఆదరించినవారిని నిరాకరించినట్లవుతుంది కాబట్టి, తమకు తోచింది చెప్పదలచారు-చెప్పారు.
కొడుకులకోసం యజ్ఞం చేస్తున్న దశరథుడికి ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయసం, క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో వున్నటువంటి అమృతం కాదు. భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి - నిమిత్తమాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే, భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. అదే అమృతమైతే, తాగిన స్త్రీలకు మరణం రాదు కదా! అందుకే, శ్రీరామాది జననములు "రేతస్సర్గం" కారణం కాదనీ-వారి దేహాలు అప్రాకృతాలనీ తెలుసుకోవాలి. అదే దశరథుడు కనుక తాగుంటే, వచ్చిన గర్భాలకు రేతస్సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యంకాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా, మాంధాతృ జననం, కుంభజులైన అగస్త్య-వశిష్ఠ-ద్రోణాచార్య జననం, ధృష్ట్యద్యుమ్న-ద్రౌపది జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం కాదు-గర్భస్థజీవుడే తన తపో బలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లిదండ్రుల జాతికి, బిడ్డల జాతికి సంబంధం లేదిక్కడ. కట్టెల్లో పుట్టిన అగ్నిహోత్రుడిది ఏజాతి? తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు-కౌసల్యా దశరథులకు పుత్రమోహం కలిగించేందుకు, భగవంతుడు పన్నిన పన్నాగమే ఇది. అందుకే, ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ, "దశరథ పుత్రా" అని కాని-"కౌసల్యా పుత్రా" అనికాని అనకుండా, "కౌసల్యా సుప్రజారామ" అన్నాడు. స్వేచ్చానుసారం-స్వతంత్రంగా-కారణాంతరాలవల్ల, తపోబలంతో కారణజన్ములైన మహాత్ముల జన్మలకు, పామరుల జన్మలకు పోలికేలేదు. వాల్మీకి చెప్పినట్లు, శ్రీరాముడిని "సాక్షాత్తు విష్ణువు" అని మునులందరు నమస్కరించారు కాని, క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లైతే నమస్కరించక పోయేవారు.
పాయసం పంచడంలో దశరథుడు, భార్యలలో పెద్ద-పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్దభార్య-పట్టపు దేవి కౌసల్య. రెండోది సుమిత్ర. మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు మొదలే. తక్కిన సగభాగంలో రెండవ భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికిస్తే, సుమిత్రను-కైకేయిని సమానంగా చూసినట్లవుతుందనీ-అది ధర్మంకాదనీ, నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి, మిగిలిన పాతిక భాగంలో సగం కైకేయికి-సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున "పరక" పాలిచ్చాడు. ఆవిధంగా, సగం కౌసల్యకు-పాతిక ఒకసారి, పరక ఒకసారి సుమిత్రకు-పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగ విషయంలో ప్రియురాలు కాని న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లైతే, పెద్ద-చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మ దృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే, రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరొచ్చింది అందుకే. ఇకపోతే: రామచంద్రమూర్తి విష్ణువు అర్థాంశం. లక్ష్మణుడు పాదాంశం. భరత-శత్రుఘ్నులు ఇరువురుకలసి పాదాంశం. తనకు న్యాయంగా రావలసిన భాగం దశరథుడు తనకీయగానే కౌసల్య పాయసాన్ని తాగింది-ఆకారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్టుడయ్యాడు.సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడు గా పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు.
దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు, బలవంతులను-కామరూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశించాడు బ్రహ్మ. దేవతలు-సిద్ధులు-సాధ్యులు-కిన్నరులు-కింపురుషులు-ఋషులు-చారణులు-ఖేచరులు మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను విస్తారంగా పుట్టించారు. వారందరూ, కానల్లో-కోనల్లో-పర్వతాలలో సంచరించసాగారు. భూమిపై వ్యాపించి, రాళ్లు - చెట్లు - గోళ్ళు - కోరలు, ఆయుధాలుగా చేసుకొని, నానా శస్త్రాస్త్ర ప్రయోగాలను తెలుసుకున్నారు. దేవతల పుత్రులు కనుక స్వయంగానే శస్త్రాస్త్రజ్ఞానం కలవారే. కాకపోతే వాటితో యుద్ధంచేయరు-చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ-వృక్ష-శిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం పరులనుండి తమను రక్షించుకోవడానికే గాని, ఇతరులపై ప్రయోగించడానికి కాదు. రామ రావణ యుద్ధంలో, రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్ర యుద్ధం చేసిన వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారలా చేసుంటే, వానరులను రావణుడు స్వభావవానరులుకాదనీ - దేవతలనీ తెలుసుకొనేవాడు. అప్పుడు వారివల్ల రావణుడికి బాధలేదు. దేవతలు పశుపక్ష్యాదులతో కొక్కోక శాస్త్రం ప్రకారం, ఆంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప బలంతోనే - తామే ఆయా జాతి స్త్రీులయందు, ఆయా ఆకారాలు ధరించి, జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం, స్త్రీ - పురుష సంభోగం లేకుండానే, సంతానం దృష్టి - స్పర్శ - సంకల్పంతో కలిగేదని విష్ణుపురాణంలో వుంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకెలా సహాయపడ్డాడని సందేహం కలగొచ్చు. వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ" మని అని పేరు. వాలి రావణవధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు. వాలి వధానంతరం సుగ్రీవుడితో: "వాలివలె నీవుకూడా సమయంపాటించకపోతే వాడి గతే నీకూ పట్తుంది"అని రాముడు అంటాడు.ఈ సమయమనేది రామసుగ్రీవులకు ఋశ్యమూకంలోనే జరిగిందికాదనీ-వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందనీ మరో కథ వుంది.ఈ విషయం అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే-పుట్టినా సుగ్రీవుడితో విరోధించకపోతే-విరోధించినా రాముడి చేతిలో చావకపోతే, రావణాసురుడి వధే జరుగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే సుగ్రీవుడికి-రాముడికి స్నేహం కలిగింది. అదే, వాలికి-రాముడికి స్నేహమయినట్లైతే ప్రయోజనంలేకపోయేది.వాలి భయంతో, రావణుడు సీతను రాముడికి అప్పచెప్పేవాడే. అంటే, లోకోపద్రవం తగ్గేదికాదు. అపరాధికి శిక్షపడకపోయేది. వాలి జననం-సుగ్రీవుడితో విరోధం-రాముడి చేతిలో చావు, రామ కార్యమే.
దశరథుడి వద్దకు విశ్వామిత్రుడు యాగ రక్షణకై రాముడిని పంపమని అడగాడానికొచ్చేంతవరకు, భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఇక ఇక్కడినుంచి, చివరివరకూ, భగవదవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో, శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి. ఈ ప్రయోజనాల్లో సేద్యం చేసేవారికి, ధాన్యంలాగా లభించే ప్రధాన ఫలం, శిశ్ఠపరిపాలనే. పైరు బాగుపడేందుకు ఏ విధంగానైతే కలుపు మొక్కలను పీకేస్తామో, అదేవిధంగా, శిష్ఠరక్షణార్థమై నడమంత్రపు సిరైన దుష్ట శిక్షణ తప్పనిసరిగా జరగాల్సిందే.
విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే దశరథుడి ముఖం విలవిల బోయింది. కొడుకుమీదుండే మోహంతో - పామరత్వంతో - శ్రీరాముడి మూల్యాన్నే ఎంచుతూ, ఆయన మహాత్మ్యాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ మరచిపోయి, రామచంద్రమూర్తిని పంపలేనని అంటాడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మహాత్మ్యాన్ని విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ, దశరథుడింకా "మారాముడు", "పసిబాలుడు", "బాలక్రీడారాముడు" అనే అంటాడు. పామరత్వంతో - పుత్ర వ్యామోహాన్ని వదలలేకపోతాడు. పదహారేళ్ళుకూడా నిండనివాడు రాముడంటాడు. మైనారిటీ తీరలేదనే అర్థం స్ఫురిస్తుందాయన మాటల్లో. యుద్ధార్హుడు కాకపోవడానికి కారణం కేవలం వయసు తక్కువగా వుండడమే కాదు - రాక్షసుల స్వభావం తెలియనివాడైనందున యుద్ధంచేయలేడని దశరథుడి ఉద్దేశం.
దశరథుడి మాటల ప్రకారం, శ్రీరాముడి కప్పుడు పదహారో సంవత్సరం నడుస్తున్నదనుకోవాలి. ఆ వయస్సులోనే కొన్నిరోజులతర్వాత వివాహం జరిగింది. ఆ తర్వాత పన్నెండేళ్లు అయోధ్యలో గడిపాడు. అయోధ్యకాండలో ఒకానొక చోట సీతాదేవి చెప్పిందాన్ని బట్టి, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. అయితే, రావణుడితో భర్తవయసెంతో చెప్తూ, వనప్రవేశసమయంలో రాముడికి 25 సంవత్సరాలనీ, తనకు  18 సంవత్సరాలనీ అంటుంది. మరో సందర్భంలో అరణ్యానికి పోయే ముందర తనను చూడడానికి వచ్చిన శ్రీరాముడితో కౌసల్య అన్న మాటల ప్రకారం, ఆయన కప్పుడు 17 సంవత్సరాల వయస్సుండాలి. ఇదే నిజమైతే, శ్రీరాముడికి ఐదవ ఏటనే పెళ్ళి జరిగుండాలి. విశ్వామిత్రుడి వెంట వెళ్ళే సమయంలో ఆయనకు ఉపనయనమయినట్లు చెప్పబడింది. ఐదో సంవత్సరంలో ఉపనయనం జరగడం శాస్త్రవిరుద్ధం కాబట్టి, శ్రీరాముడు అరణ్యానికి పోయేటప్పుడు 8+17=25 సంవత్సరాల వయస్సని గ్రహించాలి.
వాల్మీకిదొక విలక్షణమైన శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒక విషయాన్నే రెండు-మూడు సందర్భాల్లో చెప్పాల్సి వస్తే, అక్కడ కొంచెం-అక్కడ కొంచెం చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు. మోసగాడని తలంపక, తనను ఎత్తుకుపోవడానికి వచ్చిన రావణుడిని నిజమైన బ్రాహ్మణుడిగానే భావించిన సీతాదేవి, సత్యం చెప్పకపోతే శపిస్తాడేమోనని భయపడింది. వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పింది. అంటే: వనవాసం వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలనీ, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండో నెలలో శ్రీరాముడి జననం - పన్నెండో ఏట విశ్వామిత్రుడితో వెళ్ళడం - పన్నెండేళ్లు అయోధ్యా వాసం - పన్నెండేళ్లు అరణ్యవాసం - పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం. ఈ విచిత్రం తత్త్వ వేత్తలకే తెలవాలి - పామరుల ప్రశ్నోత్తరాలు కేవలం యాధృచ్ఛికాలే. పదహారవ సంఖ్య గురించి వాల్మీకి వేసిన ప్రశ్నలోనే వుంది కూడా.
తన వెంట తనయాగాన్ని రక్షించడానికి వస్తున్న రాముడిని ఉద్దేశించి, ఒక పర్యాయం, " కౌసల్యా సుప్రజ! రా, మా! సరసిజనయన లెమ్ము- కౌసల్యా నందనా, రామా, కమలలోచనా, తొలి సంధ్య వస్తోంది. దేవత కార్యం, సంధ్యావందనం చేయాలి లెమ్ము" అంటాడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజ అంటే: ఎటువంటి మంచి బిడ్డను కనడం వల్ల కౌసల్య గొప్పదయిందోనని అర్థం. ఇలానేచెప్పుకోవాలికాని, కౌసల్యయొక్క మంచి కుమారుడు శ్రీరాముడు అని అర్థమొచ్చేటట్లు చెప్పుకోకూడదు. రామచంద్రమూర్తిని కనినందువల్ల కౌసల్య ప్రసిద్ధికెక్కి ధన్యురాలైందికాని, కౌసల్యకు పుట్టినందువల్ల రాముడు ధన్యుడుకాలేదు. వాల్మీకి ఈ అర్థం వచ్చేటట్లే రెండుమూడు సందర్భాల్లో చెప్తాడీవిషయాన్ని. తండ్రి పేరు చెప్పకుండా తల్లిపేరెందుకు చెప్పాడంటే: శ్రీరామచంద్రమూర్తి నిద్రిస్తున్నప్పుడు భక్తులకు శ్రీమంతుడు గానూ-శత్రువులకు సంహరించేవాడు గానూ కనిపిస్తాడు. కాబట్టి సుఖంగా నిద్రిస్తున్న శ్రీరాముడిని లేపబోయిన విశ్వామిత్రుడు ఆయన నిద్రాకాలికసౌభాగ్యసంపత్తి ని చూసి, తానొచ్చిన పని మర్చిపోయి, నివ్వెరపొంది, ఆహా! ఇలాంటి శ్రీమంతుడికి తల్లి కావడానికి కౌసల్యా దేవి ఎంత తపస్సు చేసిందోకదా అని విస్మయంతో కౌసల్య సుప్రజ అని సంబోధించాడు. మరో విషయం: వశిష్ఠుడు చెప్పిన తర్వాతే రాముడిని పంపేందుకొప్పుకున్నాడు. కౌసల్యేమో, ఎంతపుత్రవాత్సల్యం వున్నా, సాదరంగా ఆలస్యం చేయకుండా అంగీకరించింది. ఆమేం చిక్కులుపెట్టుతుందోనని సందేహించిన విశ్వామిత్రుడికి కౌసల్య గుణ మహిమ చూసి అబ్బురపడ్డాడు. అది జ్ఞప్తి కొచ్చి ఆమె పేరు స్మరించాడిప్పుడు. దాశరథీ అనికానీ, కౌసలేయ అనికానీ, రాఘవా అనికానీ పిలువలేదు. "రామా" అనడానికి కారణం: అతడి సౌందర్యానికి అచ్చెరువందడమే.
రాముడు తన బాణంతో తాటక రొమ్ములో నాటుకునే ట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం - హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు - ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో - విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు.
విశ్వామిత్రుడి వెంట పోతున్న రామలక్ష్మణులు అడవిలో కనిపించిన సిద్ధా శ్రమ వృత్తాంతాన్ని అడిగినప్పుడు ఆ విషయం చెప్తూ, బలిచక్రవర్తి కథ, వామనావతార విశేషం గురించి కూడా చెప్పాడు. విష్ణుమూర్తి, అదితి గర్భంలో వామనుడిగా పుట్టి, బలి చక్రవర్తిని చూసేందుకు అతడి యజ్ఞ శాలకు పోయి, త్రిలోక రక్షకుడైనందున దేవతలకు కీడుచేయతలపెట్టిన బలి చక్రవర్తి దురహంకారాన్ని నాశనం చేసే కార్యక్రమం చేపట్తాడు. తన కాలి కొలత ప్రకారం, దానవ రాజును ఒకటి-రెండడుగుల భూమిని యాచించి, ఆయన వద్దనుండి దాన్ని పొంది, లోకమంతా వ్యాపించి తన శక్తితో బలిని బంధించాడు.
ఇక్కడొక విషయం అర్థంచేసుకోవాలి. బలి చక్రవర్తి ఇంద్రుడిని-ఇతర దేవతలను తృప్తి పరిచేందుకు యజ్ఞం చేయలేదు. ఆయన విష్ణు భక్తుడు - విష్ణు భక్తుడు విష్ణువును తప్ప ఇతర దేవతలను ఫలం కోరి పూజించడు. కాబట్టి, బలి చేసింది, విష్ణ్వారాధన రూపమైన యజ్ఞం. యజ్ఞమంటే దేవ పూజ-ఇక్కడ ఆయన పూజించిన దేవత విష్ణువు. ఆయా దేవతలను ప్రీతి పరిచేందుకు, వారినుద్దేశించి, ఆయా మంత్రాలతో చేసే హోమాన్ని యాగం అంటారు. బలి యజ్ఞం చేయడం సమ్మతమే. ఇంద్రాయ స్వాహా - వరుణాయ స్వాహా అన్నప్పటికీ, విష్ణు భక్తుడైన వాడు ఆ దేవతల పేర్లు చెప్పినప్పుడు తన ఇష్టదేవతైన నారాయణుడినే ఆ పదంతో పూజిస్తున్నాడని భావించాలి. అయితే, తనమీద అనన్య భక్తిగల బలిని ఎందుకు విష్ణువు అణచదల్చుకున్నాడన్న సందేహం రావచ్చు. తనమీద భక్తి వున్నవాడికంటే, తన భక్తులమీద భక్తి వున్నవాడిని చూసి సంతోషిస్తాడు భగవంతుడు. భక్త విరోధైన మరో భక్తుడిని చూసి సంతోషించడు. వాడిని శిక్షించైనా మంచి మార్గంలోకి తెస్తాడు. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే, విష్ణు భక్తులను సంతోషపెట్టాలి. తనను ఆరాధించకపోయినా, తన భక్తులను ఆరాధించేవారిని భగవంతుడు అనుగ్రహించి, వారికి ఇష్ట సిద్ధిని కలిగిస్తాడు. బలి చక్రవర్తి, దేవతలను బాధించినందువల్ల, తన భక్తుడైనా, దండించాల్సి వచ్చింది. భక్తుడైన వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఇతర భక్తులను బాధించకూడదు.
ప్రపంచ సృష్టి విషయంలో పరిణామ వాదం అని, వివర్త వాదం అని రెండు రకాలున్నాయి. మట్టి ముద్దే కుండయినట్లు, సూక్ష్మాలైన చిదచిత్తులలో వుండే భగవంతుడే, స్థూల చిదచిద్విష్టుడై, ప్రపంచాకారంగా పరిణమించాడని - సూక్ష్మానికి, స్థూలానికి అణుత్వ బృహత్త్వ భేదం తప్ప, మరే భేదం లేదని - రెండూ సత్యమని చెప్పేదే "పరిణామ వాదం". ప్రపంచం మిధ్య - బ్రహ్మమే సత్యం, అనడం "వివర్త వాదం". బాలుడు యౌవనవంతుడైనట్లు, సూక్ష్మంగా వున్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి, త్రివిక్రముడైనందువల్ల, ఇరువురికీ భేదం లేదని - రెండూ సత్యమని, తేలడంతో, వామనావతారం పరిణామవాదాన్ని స్థిర పరుస్తున్నది. దీనికే "వామన త్రివిక్రమ న్యాయం" అని పేరుంది. వామనావతారానికి యాచనే ఉద్దేశమని, ఆ కారణం తోనే, యాచన వృత్తిగా గల కశ్యపుడికి పుట్టాడని, ఇదే వామనావతార తత్త్వమని కొందరు చేసే వాదన తుఛ్చాతి తుచ్చమైన ఆలోచన. వామనుడు యాచించింది తన భార్య సొమ్ములకొరకు కాదు - తను బ్రతక లేక కాదు. యాచనా దోషం అందులోలేదు. గుర్వర్థమై - దేవతార్థమై - లోకోపకారార్థమై చేసే యాచన, యాచన కాదు.
గంగ మహాత్మ్యాన్ని గురించి రామ లక్ష్మణులకు వివరించాడు విశ్వామిత్రుడు. శంకరుడి శిరస్సులో పడినందున-పాపాలను పోగెట్టేదైనందున పావనమైంది గంగంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు ధరించాడు.అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు పావనులై-గంగనూ పావనం చేసారు. శివుడి శిరస్సునుండి వెలువడిందికనుకనే గంగ పవిత్రమైందని-అంతకు ముందు అపవిత్రమయిందనీ అనడం సరికాదు. వాస్తవానికి, భగీరథుడి కోరిక ప్రకారం గంగా జలాలు తన శిరస్సుమీద పడడం చూసిన శివుడు, యోగ్యుడనయ్యానని భావించి-పావనుడు కావడానికి గంగను తన శిరస్సుపై ధరించాడు. గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణు పాదంలో పుట్టడమే. హరుడి శిరస్సునందుండి పడడం వల్ల గంగ పుణ్య నదైందని శైవులు వాదిస్తారు. గంగ పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవ వాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్య శివుడి శిరస్సులో పడిందనుంది. గంగాశివులకు పరస్పర సంబంధం లేనప్పుడు కూడ ఇద్దరూ పుణ్యులనే అర్థం. అయోధ్యా కాండలో వశిష్ఠ వాక్యంగా కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాద తీర్థం ధరించి పార్వతీ పతి ధన్యమయ్యాడు అని చెప్పబడుతుంది ఒకానొక చోట.
గంగా జలాన్నంతా నిమిషంలో తాగిన జహ్నముని రాజర్షి. భరత వంశపు రాజు. ఆ వంశంలో అజామీఢుడు అనే రాజుండేవాడు. ఆయన కొడుకే జహ్నుడు. ఆయన కొడుకు సింధుధ్వజుడు. ఆయన కొడుకు బలాకాశ్వుడు. బలాకాశ్వుడి కొడుకు వల్లభుడు. ఆయన కొడుకు కుశికుడు. కుశికుడి కొడుకు గాధి. కొడుకుకై గాధి తపస్సు చేస్తున్నప్పుడు అడవిలో ఆయనకు సత్యవతి జన్మించింది. తర్వాత విశ్వామిత్రుడు పుట్టాడు. సత్యవతిని భృగు వంశంలో పుట్టిన చ్యవనుడి కొడుకు ఋచీకుడు వివాహం చేసుకున్నాడు. సత్యవతి-ఋచీకులకు జమదగ్ని పుట్టాడు. జమదగ్ని భార్య రేణుక. వీరిరువురికి పరశురాముడు జన్మించాడు.
మరో ఆసక్తికరమైన విషయం గంగా మహాత్మ్యం సర్గలో చెప్పబడింది. కుమార సంభవ సందర్భంలో "రసవాదం" గురించి పరోక్షంగా చెప్పినట్లే ఇక్కడ యోగ విషయం చెప్పడం జరిగింది. గంగోద్భవానికి యోగవిద్యకు సంబంధముందని ఈ సర్గలో వాల్మీకి చెప్పిన శ్లోకాల్లో వుందంటారు వాసుదాసుగారు. "ప్రాణ శక్తి వాయువాహనగా, బ్రహ్మ రంధ్రం మూలంగా, సహస్రార కమలస్థానం ప్రవేశించి, అక్కడనుండి, శివ స్థానమైన ఆజ్ఞా చక్రానికి దిగి, అక్కడ మూడు పాయలుగా ఇడాపింగళసుషుమ్నలవతుంది. అందులో సుషుమ్న మధ్యది. దీన్నే తపోబలంతో భగీరథుడు తెచ్చాడు. ఇది మేరు దండం వెంట కిందకు దిగి-దిగి, మూలాధారంలోని కుండలిని (నాగ లోకాన్ని) తాకింది. ఈ కారణాన, నిశ్చేష్టంగా పడి వున్న అణువులు ఊర్ధ్వగాములవుతాయి". అని సూచన మాత్రంగా వ్యాఖ్యానించి, యోగులకు సవిశేషంగా తెలుస్తుందని అంటారు వాసుదాసుగారు. కాకపోతే ఇతరులకీ విషయం అభేద్యం అనికూడా చెప్తారు.
క్షీరసాగర మధనం గురించి చెప్పినప్పుడు అనేక రహస్యాలు బాలకాండలో వివరించబడ్డాయి.ఇంద్రుడు ఒకనాడు ఐరావతాన్నెక్కి విహారానికి వెళుతుంటే దుర్వాసుడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఒక పుష్ప హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తను ధరించకుండా, ఐరావతం కుంభాలకు చుట్టాడు. అది తొండంతో దాన్ని తీసేసి, నేలపై పడవేసి కాల రాసింది. సగౌరవంగా తానిచ్చిన పూల దండను, ఐశ్వర్యమదంతో అగౌరవ పర్చి-అవమానించిన ఇంద్రుడి ఐశ్వర్యమంతా సముద్రం పాలై పోవాలని దుర్వాసుడు శపించాడు. వెంటనే ఇంద్రుడి ఏనుగులు, గుర్రాలు, మణులు, ఇతర భోగ పదార్థాలన్నీ మాయమై సముద్రంలో పడ్డాయి. ఇంద్రుడు దరిద్రుడై-బుద్ధిమంతుడై, మరల విష్ణువును ప్రార్థించాడు. మున్ముందు పెద్దలను అవమానించ వద్దని ఇంద్రుడికి హితవు పలికి-బుద్ధిచెప్పి, మందరంతో పాల సముద్రాన్ని చిలకమని, అందులోంచి ఆయన మునుపటి ఐశ్వర్యమంతా లభిస్తుందని చెప్పాడు విష్ణుమూర్తి. అలా, ఆ మహా విష్ణువు సహాయంతో, ఇంద్రుడు మరల లబ్దైశ్వర్యుడు అయ్యాడు.
పాల సముద్రంలో అమృతం పుట్టడం కూడా యోగశాస్త్రాన్ననుసరించే వుంది. మూలాధారమందుండే త్రికోణం మందరం. దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని మథించిన సురాసురులు ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార భూతుడు విష్ణువు. కుండలి మొదలు మేల్కొన్నప్పుడు, దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని, అపాయాన్నుండి కాపాడమని ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు. అమృతం పుట్టినప్పటికీ, ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు. అందువల్ల ఆయనే విఘ్నాలను అణచివేసి, అమృతాన్ని దేవతలకిచ్చాడు.
అహల్యా వృత్తాంతం కూడా ఇతర రామాయణాలకన్నా భిన్నంగా వుంటుంది మందర మకరందంలో.అహల్య శిలగా మారిందని కొన్ని గ్రంథాలలో చెప్పబడిన విషయం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. వాల్మీకి మతమే వేరు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లెలా అవుతుంది? అహల్య స్త్రీగా వుంటూనే, ఆహారం లేకుండా తాపంలో మాడుతుంటుంది. రామచంద్రమూర్తి ఆశ్రమ ప్రవేశం చేయగానే ఆ తాపం తొలగి లోకానికి కనిపిస్తుంది. అంటే, జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. అలా కాకపోతే వంశ నాశనం అవుతుంది. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. జారత్వమే అభ్యాసంగా వుంటే, ఆ స్త్రీని పతితగా భావించి స్వీకరించ కూడదు-పరిత్యజించాలి. స్త్రీలు తమ జాతివారితో వ్యభిచరించినప్పటికీ, గర్భం రాకపోతే పరిత్యజించ రాదు. అంటే, గర్భం వచ్చినా-అసవర్ణులతో వ్యభిచరించినా, వదిలి పెట్టాలి. గర్భం ధరించకపోతే, న్యాయ శాస్త్ర ప్రకారం దండించి ప్రాయశ్చిత్తం చేయించాలి. కుక్కలతో కరిపించాలని కూడా శాస్త్రంలో వుంది.
వశిష్టుడి గురించి చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను "జపివర్యుడు", "జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్ని మింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జప బలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.
గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకి రామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు మధ్య జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పు తిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడిని, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడిని, దెబ్బకు-దెబ్బ అనికూడా కీడు తలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు.
ఆంధ్ర వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతి చోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. బొందితో స్వర్గానికి పోవాలన్న త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన ఇష్టప్రకారం, అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని గురువును (వశిష్ఠుడు) త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.
త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం తెలిసి, కోపించి, తన దగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు, భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య, నడిమి కొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి, వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడం,  పాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన వశిశ్ఠుడు. అప్పటినుంచి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు, తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్ల, ఆయన వచ్చి అడగ్గానే, వశిశ్ఠుడు కాదన్నా, యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు. ఒక వైపు ఆయన శక్తిని ప్రదర్శించినా, మరో విధంగా ఫలితం కూడా అనుభవించాడు.
విశ్వామిత్రుడి తపస్సువలన, సర్వం అనర్థకమైన కోపాన్ని జయించినవాడికే తపస్సిద్ధి కలుగుతుందనీ, బ్రాహ్మణ్యానికి కామ-క్రోధాలను జయించడం ఆవశ్యమని అర్థమవుతున్నది. కామ క్రోధాలు రెండూ, రజోగుణం వల్ల కలుగుతాయి. వీటికెంత ఆహారమైనా సరిపోదు. ఇవి మహా పాపాలు-శత్రువులు. తపస్సిద్ధికి జితేంద్రియత్వం అవశ్యం. ఏం తిన్నా, తాకినా, చూసినా, విన్నా సంతోషంగాని-అసంతుష్టిగాని పడడో వాడే జితేంద్రియుడు. కామ క్రోధాలను విశ్వామిత్రుడు జయిస్తే దశరథుడిపై కోపం ఎందుకొచ్చిందని సందేహం కలగొచ్చు. ఆయన మునుపటి విశ్వామిత్రుడయివుంటే వాస్తవానికి శపించాలి. అలా చేయలేదు. ఆ కోపం ఆయన కార్యసాధనకు తెచ్చుకున్న కోపంకాని, ఇంతకుముందు లాగా మనస్సులో కాపురముంటున్న కోపం కాదు.
విశ్వామిత్రుడు తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని తపస్సు చేసి, తర్వాత, ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మహర్షులంతా జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి-ఆహారం మాని-వాయువే ఆహారంగా తపస్సు చేశాడు. ఇంతచేసినా కామాన్ని జయించగలిగాడుగాని, కోపాన్ని జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా-కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు. జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి వచ్చిందంటే దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా-ఎంత చేసినా కామ క్రోధాలు అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు. అందుకే బ్రాహ్మణ్యం సులభమైంది కాదు.
సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాలవారు వంశ క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది. జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు.
ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరుడి తండ్రి అసితుడిని హైహయులు-తాల జంఘులు-మరికొందరు కలిసి రాజ్య భ్రష్టుడిని చేసి తరిమేశారు. ఆయనప్పుడు హిమవత్పర్వతానికి పోయి నివసించాడు. అక్కడప్పుడు సగరుడి తల్లి గర్భవతిగా వుంది. ఆ సమయంలో అసితుడు మరణించాడు. ఆయన భార్య సహగమనం చేయబోతుంటే, చ్యవనుడు వారించి ఆమెను తన ఆశ్రమంలో వుంచి రక్షించాడు. ఆమెకు పుట్టిన సగరుడికి తానే సంస్కారాదులు చేసి, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్ర విద్యలనూ నేర్పాడు. బుద్ధి తెలిసిన సగరుడు తన తండ్రి వివరాలను అడిగితే, తల్లి ఆ వృత్తాంతమంతా వివరించింది. సగరుడు తండ్రిని తరిమిన వారితో యుద్ధంచేసి, ఓడించాడు. గురువాజ్ఞ ప్రకారం వారిని చంపలేదు. వారిలో యవనులను బోడితలల వారిగానూ, శకులను అర్థముండులుగా, బారదులను విరితల వారిగా జాతి భ్రష్టులను చేశాడు. అలా ఆ క్షత్రియులందరినీ స్వాధ్యాయ హీనులుగా-వషట్కార రహితులుగా-స్వధర్మ హీనులుగా చేసి దేశంనుండి వెళ్లగొట్టాడు సగరుడు.వీరే "మ్లేచ్ఛులు”. ఇప్పటి తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారే. ఆర్యన్కు వికృతి "అయిరాన్". అదే ఇరాన్ గా మారింది తదనంతరం.
సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.
"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-శౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరిని అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది. రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువకాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.
ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురు" అంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మంమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయి నందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థులయందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం.
పరశురాముడు శ్రీరాముడిని అడ్దగించి, తనతో ద్వంధ యుద్ధం చేయమని అడిగిన సందర్భంలో చాలా విషయాలుఅవగతమౌతాయి. పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా-శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు-జనార్ధనుడు ఒకడే. సృష్టి-స్థితి-నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో వున్న వైష్ణవ తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థంచేసుకోవాలి. పరశురామావతారం ఆవేశావతారం. కార్యార్థమై, జీవుడిలో తత్కాలంవరకు, భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశావతారమవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం. జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు పూజ్యమైనవికావు-మోక్షమిచ్చేవీ కావు. శ్రీరామావతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది.
బాల కాండ చివరలో సీతారాములు అయోధ్యలో వివాహానంతరం గడిపిన విషయాన్ని వివరించబడింది. అయోధ్యా నగరంలో శ్రీ సీతా రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే, సీత దగ్గరలేని సమయం దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని భావం. అయితే, సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారైవున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో అలానే సుఖపడ్డారని.
రామచంద్రమూర్తి కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత శక్తెలా వచ్చిందంటే, ఆమె మైథిలికన్య-మహా జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి అవకాశం లేదు.బాల కాండ వృత్తాంతమంతా 12ఏళ్లు. బాల కాండ మందర మకరందం చదివిన వారికి, రామాయణమంతా చదివినఅనుభూతి కలగడంతో పాటు అనేకమైన అద్భుతాలు, రహస్యాలు వివిధ సందర్భాల్లో చెప్పిన కథల ద్వారా తెలుసుకోవచ్చు.
నారదుడు వాల్మీకికి చెప్పిన సంక్షిప్త రామాయణం-వాల్మీకి యోగదృష్టితో తెలుసుకున్న రామాయణం చదవడమంటే మొత్తం రామాయణాన్ని చదివినట్లే. వాల్మీకి ప్రశ్నలకు నారదుడిచ్చిన సమాధానం ద్వారా, భగవంతుడు సాకారుడా-నిరాకారుడా అనే విషయం, తత్వ విచారం కంటే గుణ విచారమే శ్రేయస్కరమన్న విషయం, శ్రీరామచంద్రుడంటే పరతత్వమైన విష్ణుమూర్తేననీ, నారదుడు ఉపదేశించింది మోక్ష విషయమైన భగవంతుడి గురించేననీ బాల కాండ చదివినవారికి బోధపడుతుంది. కవిత్వమంటే ఏమిటి, కావ్య లక్షణాలేంటి, ప్రబంధ లక్షణాలేంటి తెలుసుకోవచ్చు. ఉపాయ వివేచనం, శరణాగతికి ముఖ్య ఫలం, పురుష కారం, అధికార స్వరూపం, భగవత్ పారతంత్ర్యం, భాగవత పారతంత్ర్యం, అర్థపంచక జ్ఞానం, అకించినత్వం, ఆచార్యవరణం, ఔత్కంఠ్యత, నడవడి, వాసస్థానం, రామాయణం ద్వయార్థ వివరణరూపం, గాయత్రి, దుర్విచార పరిహారం, సంహర జిహాస, చతుష్షష్టి కళల గురించి వివిధ సందర్భాల్లో తెలుసుకోవచ్చు.
    వీణల గురించి, మంత్రుల లక్షణాల గురించి, అతిథి అంటే ఎవరనే విషయం గురించి, బ్రహ్మచర్యం గురించి, సందర్భం లేకుండా తెలిసిన విషయమైనా చెప్పకూడదన్న విషయం గురించి, విష్ణు శబ్ద నిర్వచనం గురించి తెలుసుకోవచ్చు. సరయూ నది వృత్తాంతం, మలద కరూశాల వృత్తాంతం, సిద్ధా శ్రమ వృత్తాంతం, బలిచక్రవర్తి వృత్తాంతం, పరిణామ వాదం, కుశనాభుడి వృత్తాంతం, బ్రహ్మ దత్తుడి చరిత్ర, గంగానది వృత్తాంతం, కుమారస్వామి జననం, సగర చక్రవర్తి వృత్తాంతం, బ్రహ్మ కల్ప వివరణ, భగీరథ వృత్తాంతం, విశాలనగర వృత్తాంతం, క్షీరసాగర మథనం, గౌతమాశ్రమ వృత్తాంతం, విశ్వామిత్రుడి వృత్తాంతం-ఆయన రాజర్షిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా కావడం, వశిష్ఠ-విశ్వామిత్రుల యుద్ధం, త్రిశంకోపాఖ్యానం, శునస్సేపోఖ్యానం, గోదాన వివరణ లాంటి అనేక విషయాలు బాలకాండ మందర మకరందం చదివితే తెలుసుకోవచ్చు.
    వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు, పరిశోధనా దృక్ఫదంతో చదివితే. ఇవన్నీ బాల కాండలోనూ దర్శనమిస్తాయి. బాలకాండ మందర మకరంలో ఇవన్నీ వివరించబడ్డాయి.అందుకే-ఇందుకే చదవాలి.

 

Related Posts