పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం మరో మధ్యంతర పిటిషన్ ను దాఖలు చేసింది. కేంద్రం ప్రభుత్వం పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ ను పదే పదే నిలుపుదల చేయడంపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఒరిజనల్ సూట్ పై విచారణా అంశాలను న్యాయస్థానానికి కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందచేసాయి. ఇంకా ఏవైనా కీలక దస్త్రాలు ఉంటే రెండు వారాల్లో అందజేయాలని ఒడిశా ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రం కూడా దాఖలు చేయాలనుకుంటే ఒడిశా అందజేసిన తర్వాత మరో రెండు వారాల గడువు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుతో వివిధ రాష్ట్రాల్లో గిరిజనులకు నష్టం వాటిల్లితోందని రేలా సంస్థ మరో పిటిషన్ దాఖలు చేసింది. రేలా సంస్థ ఎవరో, రిజిస్టర్ సంస్థయేనా కాదా అన్న వివరాలు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజలకు నష్టం వాటిల్లుతోందంటే ప్రభుత్వాలు చూసుకుంటాయని, ఏ ప్రభుత్వానికైనా మీరు ప్రజలకు నష్టం జరుగుతుందని నివేదించారా అని రేలా తరపు న్యాయవ్యాదిని ధర్మాసనం ప్రశ్నించింది.