కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆ జిల్లాకు చెందిన ఎంపీలు, ఐకాస నేతలు కోరారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో వెంకయ్యను కలిసిన నేతలు.. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని వివరించారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.విభజన హామీలపై ఢిల్లీలో టీడీపీ పోరాటం కొనసాగుతోంది. పార్లమెంట్‌లో నిరసన తెలియజేస్తున్న ఎంపీలు.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. కడప ఉక్కు పరిశ్రమతో పాటూ విభజన హామీలను నేరవేర్చాలంటూ నిన్న రాష్ట్రపతిని కలిశారు. తర్వాత కేంద్ర ఉక్కుశాఖమంత్రిని కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు. పోరాటంలో భాగంగా ఇవాళ ఎంపీలు, పార్టీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యతో భేటీ అయ్యారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విభజన హామీలతో పాటూ కడప ఉక్కుపరిశ్రమ అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం మొదటి నుంచి టీడీపీ పోరాటం చేస్తోందని.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష కూడా చేపట్టామని గుర్తు చేశారు. పరిశ్రమ రావడం వైసీపీకి ఇష్టం లేదని విమర్శించారు. ఇటు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ప్లకార్డులతో నిరసనను తెలియజేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వెరైటీగా మాయల ఫకీరుగా మారిపోయారు. కాళీమాత అనుగ్రహంతో ఏపీకి మంచి చేయడానికి వచ్చిన ఫకీరునని.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.. ప్రతి తెలుగువాడిని తోటరాముడిలా మార్చి కేంద్రంపైకి వదులుతానంటూ కామెడీ డైలాగులు చెప్పారు.
ఉపరాష్ట్రపతిని కలిసేందుకు తమతో రావాలని వైసిపీ నేతలను కోరగా వారు స్పందించలేదన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదని.. కడప జిల్లా ప్రజలు బాగుపడటం ఆయనకిష్టం లేదు. ఉక్కు పరిశ్రమ వస్తే ఆ క్రెడిట్ అంతా తెలుగుదేశానికే వెళ్లిపోతుందడని జగన్ ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.