ఊహించని రీతిలో మోడీ ఇచ్చిన బంఫర్ ఆఫర్ ను ఆంధ్రోళ్లు తమకు తగ్గట్లుగా మార్చుకునే ఛాన్స్ వచ్చింది. ఆగస్టు 15నాడు నా ప్రసంగం గురించి మీ ఆలోచనలు.. సలహాలు ఏమిటి? వాటిని నరేంద్రమోడీ యాప్ లో ప్రత్యేకంగా కేటాయించిన విభాగంలో నాతో పంచుకోండి అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ హోదా ఆకాంక్షను మోడీకి తెలియజేయాలి..మొండోడు మోడీ. ఆ మాటకు మరో మాటే లేదు. మరి.. మోడీ కంటే మొండోళ్లు ఆంధ్రోళ్లు అన్న విషయాన్నిచాటి చెప్పే అద్భుత అవకాశం ఇప్పుడు వచ్చింది. నాది కానిది కోటి రూపాయిలు అయినా అక్కర్లేదు.. కానీ.. నాదైన రూపాయి కోసం ఎంతవరకైనా వెళతామన్నట్లుగా ఆంధ్రోళ్లు గళం విప్పాల్సిన అవసరం ఉంది. టైం చూసుకొని మరీ.. చావుదెబ్బ కొట్టే ఆంధ్రోళ్లు.. తమ మనసులోని మాటను ప్రధాని మోడీకి నేరుగా చెప్పే అద్భుత అవకాశం ఇప్పుడు వచ్చింది. మీ కోర్కెలు, సలహాలేంటో చెప్పండి.. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో నేను వాటిని చెబుతానంటూ ప్రధాని ఒక అవకాశాన్ని ఇచ్చారుఅయ్యా మోడీ.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఏపీకి వచ్చిన మీరు.. తిరుపతి..గుంటూరు.. విశాఖపట్నం లాంటి చోట్ల మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాటను వదిలేయండి. కనీసం మీరు ఇచ్చిన హామీని అయినా నెరవేర్చండి. ఇంతకూమేం చెప్పేదేమంటే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం పాలకులకు ఉండాల్సిన ప్రధమ లక్షణం. అది మీలో ఉందని నమ్మకం కలిగేలా మీరు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం... అన్న తరహాలో మోడీ యాప్ లో ప్రతి ఆంధ్రోడు తన హోదా ఆకాంక్షను వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.ఇదొక్కటే కాదు.. ప్రజల ఆకాంక్ష తెలుసుకునేందుకు మోడీ ఇచ్చే ఏ అవకాశాన్ని ఆంధ్ర ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల హోదా ఆకాంక్ష ఆయన చెవిలో మారుమోగుతూనే ఉండాలని కోరుతున్నారు