మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ‘నేషనల్ హెరాల్డ్’ సర్వే ఆసక్తిదాయకంగా ఉంది. త్వరలోనే జరగనున్న ఈ రాష్ట్ర ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు కీలకమైనవి. ఈ రెండు పార్టీలే అక్కడ ముఖాముఖి తలపడబోతున్నాయి. మధ్యప్రదేశ్ తో పాటు జరిగే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేయగలవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో జెండా పాతేది ఎవరు? అనేది దేశమంతటా ఆసక్తిని రేపుతున్న అంశంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేలు.. కమలం పార్టీదే విజయం అని అంటుండటం విశేషం. నేషనల్ హెరాల్డ్ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఎలాంటి సమీకరణాల మధ్యనైనా బీజేపీనే విజయం సాధిస్తుంది. మొత్తం 230 అసెంబ్లీ సీట్లున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీల పొత్తు ఊహాగానాలున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తే అవి 103 సీట్లను సాధించుకునే అవకాశం ఉంది. 126 సీట్లలో విజయం ద్వారా కమలం పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైన మెజారిటీ ఖాయంగా దక్కనున్నదని సర్వేలో పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్, బీఎస్పీల మధ్యన పొత్తు కుదరక.. ఆ రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేస్తే.. బీజేపీకి తిరుగే ఉండదని ఏకంగా 147 సీట్లను కమలం పార్టీ సొంతం చేసుకోవడం ఖాయమని ఈ సర్వే పేర్కొంది. సోలోగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు దక్కేది కేవలం 73 సీట్లు మాత్రమే అని ఈ సర్వే తేల్చింది.ఓవరాల్‌గా బీఎస్పీతో కలిసి పోటీ చేసినా, సోలోగా బరిలోకి దిగినా.. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు లేవని.. మోడీ ప్రభ మధ్యప్రదేశ్‌లో ఏ మాత్రం తగ్గలేదు.. ఈ రాష్ట్రంలో వరసగా మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది.