నటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్ తదితరులు
కథ: మారుతి
దర్శకుడు: ప‌్రభాకర్.పి
మ్యూజిక్: జె.బి
లిరిక్స్: పూర్ణాచారి
కెమెరా: కార్తిక్ పళని
ఎడిటర్: ఉద్ధవ్
ఆర్ట్: మురళి
`ఈరోజుల్లో` సినిమాతో దర్శకుడిగా మారిన మారుతి.. ఆ తర్వాత నిర్మాతగా మారి తను గుర్తించిన దర్శకులకు అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు మారుతి బ్రాండ్ కోసం ఆయనతో కలిసి సినిమాలు చేస్తున్నారు. తాజాగా శైలేంద్ర ప్రొడక్షన్స్ సంస్థ మారుతి కథతో ప్రభాకర్.పి దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించింది. ఆ సినిమానే బ్రాండ్ బాబు. బ్రాండ్లకు విలువిచ్చేవారు ఎలా ఉంటారనే అంశాన్ని సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఆ సినిమా ఎలా ఉందో.. ఏంటో ఒకసారి చూద్దాం.
కథ
డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర) రిచ్ కిడ్. అతని తండ్రి రత్నం (మురళీశర్మ)కు బ్రాండ్ పిచ్చి ఎక్కువ. కుటుంబం మొత్తం అలాగే ఉండాలని అనుకుంటాడు. అందరూ అలాగే మసలుకుంటారు. మంచి బ్రాండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డైమండ్ అనుకుంటాడు. అనుకోకుండా ఒకసారి అతని సెల్‌కి ఓ నెంబర్ నుంచి లవ్యూ అని మెసేజ్ వస్తుంది. ట్రూ కాలర్‌లో ఛేజ్ చేస్తే అది హోమ్ మినిస్టర్ కూతురు అని తెలుస్తుంది. ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తుంటాడు. అయితే అక్కడ హోమ్ మినిస్టర్ కూతురికి బదులు, వారింటి పనిమనిషి రాధ (ఈషా) ఫోన్ అటెండ్ చేస్తుంటుంది. డైమండ్ తనను ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది. తీరా నిశ్చితార్థం వరకు వచ్చాకగానీ డైమండ్‌కి తను చేసిన పొరపాటు అర్థం కాదు. అయితే ఆ తర్వాత ఏమైంది? డైమండ్ మారాడా? రాధ తన స్తోమతను అర్థం చేసుకుని అతనికి దూరమైందా? హోమ్ మినిస్టర్ కూతురే డైమండ్‌ని అర్థం చేసుకుందా? అనేది ఆసక్తికరమైన అంశం.
విశ్లేషణ
మతిమరుపు, ఓసీడీ వంటి లక్షణాలున్న హీరోల కథలను ఇంతకు ముందు తెరపైకి తీసుకొచ్చారు మారుతి. మన చుట్టూ ఉన్న జీవితాల్లో కనిపించే విలక్షణమైన అంశాలను తెరకెక్కించే ప్రయత్నంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. అదే పంథాలో ఆయన రాసుకున్న కథ `బ్రాండ్ బాబు`. బ్రాండ్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ కథ ఇది. భావోద్వేగాలను లోలోపలే దాచుకుని, పైకి హుందాగా ఉండే ఫ్యామిలీ కథ. హోమ్ మినిస్టర్ కుమార్తె కోడలిగా వస్తుందనుకున్న చోటికి హోమ్ మినిస్టర్ ఇంటి పనిమనిషి కోడలిగా వస్తుందని తెలియడంతో ఏర్పడే కన్‌ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ ఈ సినిమాలో కీలకం. అక్కడక్కడా నవ్వుల్ని పూయించిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు విసుగు తెప్పించేవే. సినిమాలో ఫన్ కోసమే అనుకున్నప్పటికీ కొన్నిచోట్ల సన్నివేశాలు మింగుడుపడవు. అంత బ్రాండ్ కాన్సియస్ ఉన్న హీరో ఉన్నట్టుండి రాధ ప్రేమలో ఎలా పడతాడో అర్థం కాదు. అప్పటిదాకా బ్రాండ్ కోసం అల్లల్లాడిన హీరో తండ్రి ఎలాంటి ఎఫెక్టివ్‌గా లేని హీరో మాటలకు ఎలా మారతాడో కూడా కన్విన్స్ కాలేం. హీరోయిన్‌ని ప్రేమలో పడేయడానికి హీరో పడే కష్టాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. సత్యం రాజేశ్ పాత్ర ఏంటో... ఎందుకు సగంలో కట్ అవుతుందో కూడా అర్థం కాదు. సినిమా అబ్రప్ట్ గా అనిపిస్తుంది. సామాన్యులు అంత తేలిగ్గా కనెక్ట్ అయ్యే విషయాలు ఇందులో పెద్దగా కనిపించవు. బాగా లీజర్‌గా టైమ్ ఉంటే ఒకసారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్
- ప్రొడక్షన్ వేల్యూస్
- హీరో అసిస్టెంట్స్ కామెడీ
- ఈషా రెబ్బా
- కెమెరా
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
- రియాలిటీకి దూరంగా ఉన్న సబ్జెక్ట్
- ఫ్లాట్ స్టోరీ
- ఎగ్జయిటింగ్ అంశాలు లేవు
- బోర్ కొట్టించే పాటలు
- కృత్రిమ అంశాలు