YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి వర్గాన్ని ఆకట్టుకొనే పనిలో చంద్రబాబు

ప్రతి వర్గాన్ని ఆకట్టుకొనే పనిలో చంద్రబాబు
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు నాయుడు పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్రమంగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండు నెలలుగా చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం, ఎన్డీఏ కు కటీఫ్ చెప్పిన నాటి నుంచి చంద్రబాబు ప్రజాసంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. గ్రామదర్శిని ద్వారా ఇప్పటికే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అంగన్ వాడీ, హోంగార్డుల వేతనాలు పెంపుదల ఇందులో భాగమే. ప్రతి వర్గాన్ని ఆకట్టుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆ విధంగా ముందుకు వెళుతున్నారు.తాజాగా నిరుద్యోగ భృతి విషయంలోనూ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ భృతి పథకానికి ‘‘ముఖ్యమంత్రి నేస్తం’’ గా నామకరణం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యగ యువతను ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే ఈ పథకం రూపకల్పన జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యువతరం ఎక్కువగా వీరిద్దరి వైపే మొగ్గు చూపుతోంది. అందుకే ఆ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు నిరుద్యోగ భృతిని వెనువెంటనే యువతకు అందించేందుకు రెడీ అయిపోయారు.నిరుద్యోగ భృతి మంజూరుకు విధివిధానాలను ఖరారు చేశారు. నిరుద్యోగ భృతి పొందాలంటే ముఖ్యమంత్రి యువనేస్తం లో తొలుత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు రెండు, మూడు వారాల్లో ప్రారంభమవుతుంది. కేవైసీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తారు. ఈ నెల చివరి నుంచి నిరుద్యోగ భృతి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. సెప్టంబరు 1వ తేదీన నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు పడిపోతాయి. నిరుద్యోగ భృతిని ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే 22 నుంచి 35 సంవత్సరాల వయస్సులోపు వారై ఉండాలి. డిగ్రీ, డిప్లొమా కోర్సులు చేసిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పీఎఫ్ లు చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 64 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు గుర్తించారు. ఇందుకోసం నెలకు 640 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే దరఖాస్తుల అర్హత పరిశీలన జరుగుతుంది. 59 వేల రూపాయలకు మించి ప్రభుత్వ సబ్సిడీలు పొందిన వారికి ఈ పథకం వర్తించదు. నిరుద్యోగులకు వివిధ రూపాల్లో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇలా యువతను ఆకట్టుకునేందుకు చంద్రబాబు వచ్చే నెల నుంచే నిరుద్యోగ భృతిని యువతకు అందించనున్నారు. కాని దీనిపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. 2014 ఎన్నికల మ్యానిఫేస్టోలో 2వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు దానిని వేయి రూపాయలకు కుదించటమేమిటని? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే నాలుగేళ్ల నుంచి నాన్చి…ఇప్పుడు దీనిని తెరపైకి తెచ్చారంటున్నాయి

Related Posts