మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పాట పాడుతున్నారా..? అప్పటికీ ఇప్పటికీ ఉండవల్లి స్వరం మారుతోందా..? గతంలో చంద్రబాబును తిట్టేనోటితోనే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. జగన్ పై పల్లెత్తు మాటనని ఉండవల్లి .. ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేసి మాట్లాడటం దేనికి నిదర్శనం..? చంద్రబాబును ఓడించే సామర్ధ్యం జగన్ కు లేదని బహిరంగంగానే చెప్పడంలో అర్ధమేంటి..? ఉండవల్లి మాటలకు భావమేమి తిరుమలేశ అనుకుంటున్నారు జనం. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా .. అప్పుడప్పుడు తెరపైన కనిపించి తళుక్కున మెరుస్తుంటారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తనకు కోపం వచ్చినప్పుడల్లా ఆయానేతలపై విమర్శలు ఎక్కుపెట్టడం ఉండవల్లికి అలవాటు. పైగా సాక్ష్యాధారాలను కూడా చూపించి ఆరోపణలు చేయడం ఉండవల్లి స్టైల్. కొంతకాలంగా ఏపీ ప్రత్యేకహోదాపై పోరాడుతున్నారాయన. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ మధ్య కొంతకాలం క్రితం జరిగిన వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. ఇందులో ఉండవల్లి కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబుకు సపోర్ట్ గా మాట్లాడటం.. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. బహిరంగంగానే జగన్ పై విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.కాంగ్రెస్ లో ఉన్నప్నటినుంచే చంద్రబాబు అంటే ఉండవల్లికి పడదు. చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే ఉండవల్లి .. హఠాత్తుగా ఈమధ్య సీఎంను కలవడం ఆసక్తి రేపింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో చంద్రబాబును ఉండవల్లి కలవడం చర్చకు దారితీసింది. విభజనకు సంబంధించి తనవద్ద ఉన్న ఆధారాలను చంద్రబాబుకు ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో చంద్రబాబుపై మండిపడే ఉండవల్లి.. స్వయంగా సీఎంను కలవడం .. హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబుకు సపోర్ట్ గా మరో మాట కూడా అన్నారు ఉండవల్లి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే సామర్ధ్యం జగన్ కు లేదని .. ఆయన నడుస్తోన్న దారి సరిగా లేదని జగన్ కు నెగటివ్ కామెంట్స్ చేశారు. దానికి మారిన పరిస్థితులే కారణమట. జగన్ వెళుతున్న దారి సరికాదని.. ఆయన బీజేపీపై పోరాడకుండా .. వారిపై పోరాడుతున్న సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలు జగన్ ఏం చేస్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదని ఓ రేంజ్ లో విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఏంచేసిందో .. ఇప్పుడు బీజేపీ కూడా అదేచేస్తోందని.. అప్పట్లో ప్రజలు కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత చూపించారో.. ఇప్పుడు బీజేపీపై అంతకంటే వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ బీజేపీతో రాసుకుపూసుకు తిరిగితే ప్రజలు క్షమించబోరన్నారు ఉండవల్లి. ఉండవల్లి జగన్ పై ఎప్పుడూ లేనంతగా విమర్శలు చేశారు. సాధారణంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడు. ఆయనపై మాట పడనీయరు. వైఎస్, చంద్రబాబును పోలుస్తూ కామెంట్లు విసిరి స్వామిభక్తిని చాటుకునేవారు. అలాంటి ఉండవల్లి.. తన స్వామి కుమారుడైన జగన్ కు ఇన్నాళ్లూ మద్దతు పలుకుతూ వచ్చారు. ఆయనేం చేసినా .. గెలుపు జగన్ దేనని కుండబద్దలు కొట్టేవారు. అయితే ఇప్పుడు సడెన్ గా మాట మార్చారు. జగన్ నడిచే దారి సరిగాలేదని .. ఇలాగే ఉంటే ఓటమి ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నూ వెనకేసుకొచ్చారు ఉండవల్లి. నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిందన్నారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...ఆంధ్రాకు న్యాయం చేస్తారని, నాడు చేసిన అన్యాయానికి..ప్రాయశ్చితం చేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఉండవల్లి చెబుతున్నారు చంద్రబాబును జగన్ ఓడించలేరని..సాక్షాత్తూ..ఉండవల్లే వ్యాఖ్యానించడం.. వైసీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఇప్పటిదాకా తమకు సపోర్ట్ గా మాట్లాడి ఇప్పుడు రివర్స్ కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి మాటలకు అర్ధాలే వేరయా అనుకుంటున్నారు.